More

    Choose Your Language

    ముస్లిం మహిళలు హిజాబ్ ఎందుకు ధరిస్తారు?

    ముస్లిం స్త్రీలు హిజాబ్ తో వారి తలను కప్పుకుంటారు కానీ వారి మెదడును కాదు. హిజాబ్ ధరించడం స్త్రీ అభ్యున్నతికి అడ్డంకి కాదు. మదర్ థెరిసా కూడా తన తలను కప్పుకున్నారు. ఆమెను ఎవరైనా అణచివేతకు గురి అయిన మహిళ అని అన్నారా? కేవలం ముస్లిము మహిళల గురించి అలా మాట్లాడడం సమంజసమా?

    చాలా మంది హిజాబ్ అనేది ముస్లిం మహిళలపై నిర్భంధం విధించడం లాంటిది అని అంటారు. దీనిని విశ్లేషిద్దాము.

    హిజాబ్ అంటే ఏమిటి?

    హిజాబ్ అనేది ఇస్లాంలో మహిళలకు నిర్దేశించబడిన వస్త్ర నియమావళి. ఇందులో మహిళ తన ముఖం మరియు చేతులు (మణికట్టు క్రింది భాగం) మినహా మిగతా శరీరం అంతా వస్త్రంతో కప్పుకోవాలి.

    ఖురానులో ఈ నిర్దేశన ఆజ్ఞ ఉందా?

    రియు విశ్వసించిన స్త్రీలతో కూడా వారి చూపులను క్రిందికి పెట్టుకోమని మరియు వారి మర్మాంగాలను కాపాడు కోమని చెప్పు. మరియు వారి అలంకరణను ప్రదర్శించవద్దని చెప్పు – (దానంతట అదే) ప్రదర్శనమయ్యేది తప్ప. వారిని, తమ తలమీది దుప్పటిని రొమ్ముల వరకు కప్పుకోమని చెప్పు.

    ఖుర్ ఆన్ 24:31

    ఇస్లాంలో పురుషుల వస్త్ర నియమావళి

    ఇస్లాంలో మగవారికి కూడా వస్త్ర నియమావళి ఉంది. అందులోని అనేక నియమాలు ఆడ వారికి మగ వారికి సమానంగా వర్తిస్తాయి. ఉదాహరణకు స్త్రీ పురుషులిద్దరూ కూడా

    1. అసభ్యకరమైన బట్టలు వేసుకోకూడదు

    2. వస్త్రాలు బిగుతుగా ఉండకుండా వదులుగా ఉండాలి

    3. వస్త్రాలు పారదర్శకంగా ఉండకూడదు

    వస్త్ర నియమావళిలో వ్యత్యాసాలు

    ఇద్దరి వస్త్ర నియమావళిలో అనేక విషయాలు ఒకే రకంగా ఉన్నప్పటికీ, వస్త్రాలు ఎంత మేరకు కప్పుకోవాలి అనే విషయంలో తేడా ఉంది. ఆడ వారైతే తమ ముఖం మరియు చేతులు (మణికట్టు క్రింది భాగం) మినహా మిగతా శరీరం అంతా వస్త్రంతో కప్పుకోవాలి. మగవారు నాభి దిగువ భాగం నుండి మోకాళ్ల వరకు తప్పని సరిగా కప్పుకోవాలి.

    ఆడ మగ సమానమైతే ఎందుకీ తేడాలు?

    అవును, ఆడ మగ ఇద్దరూ సమానమే కానీ వారిరువురూ ఒకటి కారు కదా? (Equal but not same). ఆడ మగల భౌతిక లక్షణాలలో వ్యత్యాసం ఉంది కదా? ఆడవారి శరీరంలో కప్పుకోవలసిన భాగాలు ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణకు స్విమ్మింగ్ క్రీడను పరిశీలిద్దాము. అందులో పాల్గొనే క్రీడాకారుల బట్టలు వీలయినంత చిన్నవిగా ఉంటాయి కానీ అవి ఆడ వారికి మగ వారికి ఒకే రకంగా ఉండవు. ఈ తేడా ఎందుకని ఉంది? ఆడ మగ సమానమైతే ఆ బట్టలు ఒకే రకంగా ఉండాలి కదా? ఈ బట్టలలో తేడాను స్త్రీలపై వివక్షగా ఎవరైనా ఆక్షేపిస్తారా? దీనిని బట్టి ఆడవారి శరీరంలో కప్పుకోవలసిన భాగాలు ఎక్కువ అని మనకు స్పష్టంగా అర్ధం అవుతుంది కదా?

    స్త్రీలు తమ శరీరాన్ని కప్పుకోవాలా?

    స్త్రీల శరీరం మగ వారికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. స్త్రీలు కూడా మగ వారి శరీరానికి ఆకర్షితులవుతారని మీరు అనవచ్చు. అవును వారు ఆకర్షితులవుతారు కానీ అది మగ వారిలా కాదు. మీరు ఎప్పుడైనా ఒక స్త్రీ పురుషుడిపై అత్యాచారం (రేప్) చేసిందని విన్నారా? ఎందుకని వినలేదు? మరి స్త్రీలు పురుషుల వైపుకు ఆకర్షితులు కారా? అవుతారు కానీ స్త్రీ పురుషుల లైంగిక ప్రేరేపణల మధ్య వ్యత్యాసం ఉంది. ఇది మనందరికి తెలిసిన విషయమే. సైన్సు పరంగా చూసినా కూడా మగ వారి మెదడులోని లైంగిక కార్యకలాపాలకు సంబంధించిన భాగాలు దృశ్య సంబంధ సంకేతాల (visual signals) వలన వెంటనే ప్రేరేపితమౌతాయి కానీ స్త్రీలలో అలా కాక అవి భావ సంబంధమైన (emotional bonding) సంకేతాల ద్వారా ప్రేరేపితమౌతాయి.

    స్త్రీ తన శరీరాన్ని బహిరంగంగా ప్రదర్శిస్తే, చాలా మంది పురుషులు ఆమెను కామ వాంఛతోనే చూస్తారు. కొంత మంది చూసి ఊరుకోవచ్చు, కొంత మంది అశ్లీలకరమైన వ్యాఖ్యలు చేయవచ్చు, కొందరు ఆమెను అనుసరించి అసభ్యంగా ప్రవర్తించవచ్చు, ఇంకా అవకాశం ఉంటే కొందరు ఆమెపై అత్యాచారానికి కూడా ప్రయత్నించవచ్చు… ఇదంతా మనందరికీ సుపరిచితమైన వాస్తవమే కదా?

    మొత్తానికి ఒక స్త్రీ శారీరక ప్రదర్శన చేస్తే ఆమె పురుషుల దృష్టిలో ఒక లైంగిక క్రీడా వస్తువుగానే పరిగణించబడుతుంది. స్త్రీ స్వాతంత్రం పేరుతో, స్త్రీలను లైంగిక వస్తువులుగా మార్చడం జరిగింది. దీనిని ఒప్పుకోని వారు సమాజంలో స్త్రీలపై జరుగుతున్న అకృత్యాలు, Mee Too movement లాంటివి గమనించాలి. ఇందులో స్త్రీల తప్పు ఏమీ లేదు, అదంతా పురుషులదే తప్పు అని వాదించడం కొంత వరకూ సబబే కానీ ఇక్కడ గమనించవలసింది స్త్రీ పురుషుల శరీర నిర్మాణంలో, వారి కామ వాంఛలలో ఉన్న తేడాలు.. వీటిని పరిగణనలోకి తీసుకోకుండా ఇలా వాదించడం వలన ఉపయోగం ఉండదు. ఇస్లాం మానవ సహజమైన నైజాన్ని దృష్టిలో ఉంచుకుని స్త్రీలు గౌరవంతో బ్రతికే ఏర్పాటు చేస్తుంది మరియు వారిని అన్ని రకాల లైంగిక హింసల నుండి కాపాడుతోంది. ఇస్లాం స్త్రీలను మగవారి లైంగిక దౌర్జన్యాల నుండి విముక్తుల్ని చేస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు.

    హిజాబ్ స్త్రీల అభివృద్ధికి బంధకమా?

    ఒక విషయం గుర్తుంచుకోండి..ముస్లిం స్త్రీలు హిజాబ్ తో వారి తలను కప్పుకుంటారు కానీ వారి మెదడును కాదు. హిజాబ్ ధరించడం ఏ స్త్రీ అభ్యున్నతికీ అడ్డంకి కాదు. ఉదాహరణకు మదర్ థెరిసా గారిని తీసుకుందాము. ఆమె ముస్లిము కాదు. ఆమె వస్త్రధారణను గమనించండి. ఆమె చేతులు, ముఖం తప్ప మిగతా శరీరం అంతా కప్పబడి ఉంది. హిజాబ్ అంటే అదే కదా? ఆమె ఈ వస్త్రధారణ ఆమె సేవాపరంగా సాధించిన విజయాలకు అడ్డంకిగా నిలించిందా? లేదు.

    మరొక ఉదాహరణ తవక్కొల్ కమ్రాన్ అనే ముస్లిం మహిళ. ఈమె నోబెల్ శాంతి బహుమతి గ్రహీత. ఈమె హిజాబ్ ఈమెకు ఇంతటి అభ్యున్నతి సాధించడానికి అడ్డంకి కాలేదు. ఇలా ప్రపంచం అంతా చూస్తే మనకు హిజాబ్ ధరించి అనేక రంగాలలో దూసుకుపోతున్న మహిళా మూర్తులు కానవస్తారు. అందులో డాక్టర్లు, ఇంజనీర్లు, ఉపాధ్యాయులు, విమానం నడిపే పైలట్లు, PhDలు చేస్తున్న వారు ఉన్నారు. దీని గురించి ఒకసారి గూగుల్లో వెతికి చూడండి, హిజాబ్ ఏ విధంగానూ మహిళల అభివృద్ధికి అడ్డంకి కాదనే విషయం మీకే అర్ధం అవుతుంది. 

    మదర్ థెరిసా గారిని ఎవరైనా అణచివేతకు గురి అయిన మహిళ అని అన్నారా? కాథలిక్ నన్స్ అందరి వస్త్ర ధారణ కూడా అదే. వారిని ఎవరైనా అణగద్రొక్కబడిన మహిళలు అనంటారా? మరి కేవలం ముస్లిము మహిళల గురించి అలా మాట్లాడడం సమంజసమా? ఇది ద్వంద్వ వైఖరి కాదా? ఆలోచించండి.

    హిజాబ్ వేసుకోమని ముస్లిం మహిళలను బలవంతం చేస్తారా?

    ఇస్లాం అనేది స్వేచ్ఛతో అనుసరించబడే ధర్మం, అందులో ఉండే దైవాదేశాలను మనస్ఫూర్తిగా ఆచరించాలి తప్ప ఎవరి బలవంతంతోనూ కాదు.

    ధర్మం విషయంలో బలవంతం లేదు, వాస్తవానికి సన్మార్గం, దుర్మార్గం నుండి సుస్పష్టం చేయబడింది …

    ఖుర్ ఆన్ 2:256

    ముస్లిం మహిళలను ఎవరైనా హిజాబ్ ధరించమని బలవంతం చేస్తే అతడు లేదా ఆమె స్వయంగా ఖురాను ఆజ్ఞలను పాఠించనట్లే..

    ముస్లిం మహిళలు బహిరంగంగా తమ మత చిహ్నాలను ఎందుకు ప్రదర్శించాలి?

    ఇలా అడిగే వారికి మాదొక చిన్న ప్రశ్న. ముస్లిం మహిళలు హిజాబ్ ధరించడం వలన మీకు వచ్చే నష్టం ఏమిటి? ఒక మహిళ హిజాబ్ ధరించడం వలన ఇతరులకు ఎటువంటి ఇబ్బంది కలగదు కదా? మరి ఇక్కడ సమస్య ఏమిటి?

    భారత దేశం భిన్న సంస్కృతుల, విశ్వాసాల సమ్మేళనం. కేవలం ముస్లిం మహిళలు మాత్రమే తమ మత చిహ్నాలను బహిరంగంగా ధరిస్తున్నారా? హిందూ మహిళలు కూడా చాలా మంది “ఘుంగట్” (కొంగు) వేసుకుంటారు., ఇది వారి మత మరియు సాంస్కృతిక చిహ్నమే కదా?

    ఇంకా హిందూ మహిళలు నుదుటి మీద బొట్టు కూడా పెట్టుకుంటారు కదా? ఇది కూడా మతపరమైన చిహ్నమే కదా? వీటి వలన ఎవరికీ ఎటువంటి ఇబ్బంది లేదు కదా? మరి హిజాబ్ విషయంలో ఎందుకిలాంటి ప్రశ్న? మన దేశంలో అన్ని మతాల ప్రజలకు తీర్పులు చెప్పే న్యాయమూర్తులు కూడా తమ మత విశ్వాసాలకనుగుణంగా తిలకం ధరించి తమ పని తాము చేసుకుంటున్నప్పుడు, ముస్లిం మహిళలు హిజాబ్ ధరించడాన్ని ప్రశ్నించడం న్యాయమా?

    సారాంశం 

    పూర్వకాలంలో, మానవులు నగ్నంగా తిరిగే వారు. నాగరికత అభివృద్ధి చెంది, మనుషులు సభ్యత సంస్కారాలను అలవరచుకున్నారు. వస్త్ర ధారణ కూడా అందులోని భాగమే. మన నేటి వస్త్ర ధారణ మన సంస్కారానికి, పరిణితి చెందిన మేధస్సులకు ఒక చిహ్నం లాంటిది. నిండైన బట్టలు ధరించే ముస్లిం మహిళలు లేదా కాథలిక్‌ మహిళలు మన ఉత్కృష్ట నాగరికతకు తార్కాణాలు. మీ తలలపై ఆ బట్టలు ఎందుకు? అని వాదించడం, వారిని అది తీసివేయమని ఆజ్ఞాపించడం అనేవి స్త్రీల హక్కులను కాజేయడం మరియు వారిపై నిర్బంధం విధించడంతో సమానం.

    WHAT OTHERS ARE READING

    Most Popular