పరిచయం
భారతదేశం భిన్న మతాల, కులాల, భాషల, సంస్కృతుల నిలయం. ఇటువంటి దేశంలో శాంతి, సహనం మరియు సామరస్యాల ఆవశ్యకత మనకు బాగా తెలుసు. ఒక బహుళ సమాజంలో వీటిని సాధించడం ఒక పెద్ద సవాలు.
ఈ వ్యాసంలో మనం ప్రవక్త ముహమ్మద్ వారి జీవితం నుండి ఒక అద్భుతమైన, ఆదర్శనీయమైన ఘట్టాన్ని గురించి తెలుసుకుందాము. దీని ద్వారా ఒక బహుళ సమాజంలో శాంతి సామరస్యాలను ఎలా స్థాపించాలో మనం అర్ధం చేసుకోవచ్చు.
పూర్వరంగం
ముహమ్మద్ ప్రవక్త మక్కా నగరంలో జన్మించారు. ప్రవక్త పదవికి ముందు ఆయన సమాజంలో ఒక గౌరవనీయునిగా చలామణీ అయ్యారు. ఆయనకు “అత్యంత నమ్మకస్తుడు” అనే బిరుదు ఉండేది. 40 సంవత్సరాల ప్రాయంలో, ఆయనకు దైవ సందేశం అందడం ప్రారంభం అయ్యింది. మానవులంతా సమానమని, వారంతా ఒకే దైవం ద్వారా సృష్టించబడ్డారని, మన కర్మలకు మనం లెక్క చెప్పుకోవలసి వస్తుందనీ బోధించడం ప్రారంభించారు. పుట్టుక ఆధారంగా తాము ఉత్తములని భావించి నిమ్న వర్గాలను పీడిస్తున్న మక్కా సర్దారులకు ఈ బోధనలు రుచించలేదు, తమ ఆధిపత్యం కోల్పోతామని వారు భయపడ్డారు. వారు ముహమ్మద్ ప్రవక్తను, ఆయన అనుచరులను పీడించడం ప్రారంభించారు. ఈ పీడన ఒక తీవ్ర స్థాయికి చేరినపుడు ముహమ్మద్ ప్రవక్త మక్కాను వదిలి మదీనాకు వలసపోయారు.

మదీనా
మదీనా ఒక బహుళ జాతి సమాజంగా ఉండేది. అందులో విగ్రహారాధకులైన అనేక అరబ్బు జాతుల వారు మరియు యూదులు ఉండేవారు. కొంత మంది యూదులు విగ్రహారాధకులతో మరికొంత మంది ఇతర జాతుల వారితో మైత్రిని కలిగి ఉండేవారు. అనేక శతాబ్దాలుగా వారు యుద్ధాలు చేసుకుంటూ ఒకరినొకరు అణుచుకుంటూ ఉండేవారు.

మదీనా రాజ్యాంగం
ముహమ్మద్ ప్రవక్త మదీనా ఆగమనం తరువాత, అక్కడి వారు ఆయనను తమ నాయకుడిగా అంగీకరించారు. వెంటనే ఆయన అక్కడ ఉన్న భిన్న జాతుల మధ్య ఒక ఒడంబడికను చేసారు. ఈ ఒప్పందాన్నే మదీనా రాజ్యాంగం అని అంటారు. దీని ద్వారా ప్రవక్త ముహమ్మద్ ఆ జాతుల మధ్య శతాబ్దాలుగా రగులుతున్న వైరిని అంతం చేయగలిగారు.
ఇందులోని షరతులు సమానత్వం, న్యాయం మరియు మత స్వేచ్చల ఆధారంగా ఉన్నాయి. దీనిలోని కొన్ని ముఖ్య షరతులు ఇలా ఉన్నాయి

మతస్వేచ్చ మరియు సామరస్యాలకు సంబంధించిన షరతులు
యూదులు కూడా ముస్లిముల వలే ఒక సమాజంగా, సంఘంగా గుర్తింపు కలిగి ఉంటారు. యూదులు మరియు ముస్లిములు తమ తమ మతాలను ఆచరించడానికి హక్కుదారులు
యూదులు మరియు ముస్లిముల మధ్య కపటం లేని సహృద్భావము నెలకొని ఉండాలి
సమానత్వానికి సంబంధించిన షరతులు
యూదులు ముస్లిములను ఒప్పందానికి ఆహ్వానిస్తే ముస్లిములు దానిని స్వీకరించాలి. అలాగే ముస్లిములు యూదులను ఒప్పందానికి ఆహ్వానిస్తే యూదులు దానిని స్వీకరించాలి.
ఈ ఒప్పందానికి ముందు, వివిధ యూద జాతుల మధ్య కూడా అసమానత్వం విరాసిల్లుతూ ఉండేది. యూదులలో బను నాధిర్ మరియు బను ఖురైజా అనే రెండు జాతులు ఉండేవి. ఉదాహరణకు బను నాధిర్ జాతి వారు తమ జాతినుండి ఒక వ్యక్తి బను ఖురైజా జాతి వ్యక్తిని చంపితే, దానికి పర్యవసానంగా కేవలం డబ్బులు మాత్రమే ఇచ్చేవారు. కానీ తమ జాతిలోని ఒక వ్యక్తి వేరే జాతి వారితో చంపబడితే మాత్రం వాడిని చంపేవారు.
మదీనా రాజ్యాంగం ద్వారా ముహమ్మద్ ప్రవక్త యూదులలోని ఇటువంటి అసమానతలను రూపుమాపగలిగారు.
న్యాయానికి సంబంధించిన షరతులు
ముస్లిములు దుర్మార్గపు పనులు, అన్యాయపు పనులు చేసే వారికి, హద్దులు మీరే వారికి వ్యతిరేకంగా ఉంటారు. అలాంటి పనులు చేసే వాడు ముస్లిము అయినప్పటికీ, ముస్లిములందరూ అతనికి వ్యతిరేకంగా సమైక్యంగా ఉంటారు.
ఉదాహరణకు ఒక ముస్లిం, ముస్లిమేతరుడిని మోసం చేస్తే, ముస్లిములందరూ ఐక్యమై మోసపోయిన ఆ ముస్లిమేతరుడిని పక్షాన నిలబడి న్యాయం కోసం పోరాడేవారు.
ఒక హంతకుడికి సహాయం చేయడం, ఆశ్రయం ఇవ్వడం ముస్లిములకు నిషేధించబడింది.
అన్యాయంగా ప్రవర్తించే వాడు, ఈ ఒడంబడికను ఉల్లంఘించే వాడికి ఈ ఒప్పందం వర్తించదు., అతడు శిక్షార్హుడు అవుతాడు.
మదీనా రాజ్యాంగం మరియు ప్రస్తుత తరుణంలో దాని ఆవశ్యకత
మత స్వేచ్చ, సమానత్వం, న్యాయం.. వీటిని ఆచరణాత్మకంగా అమలుపరిచే ఒక రాజ్యాంగం ద్వారా వివిధ జాతుల మధ్య తరాలుగా రగులుతున్న అణచివేత, యుద్ధాలను నివారించడంలో ముహమ్మద్ ప్రవక్త సఫలీకృతులు అయ్యారు.
1400 సంవత్సరాల తరువాత కూడా, ఈ మదీనా రాజ్యాంగంలోని సూత్రాలు మన దేశంలో వివిధ మతాలు, జాతులు, భాషలు మరియు సంస్కృతులు గల ప్రజల మధ్య శాంతి, సమానత్వం మరియు సామరస్యాల సాధనకు వర్తిస్తాయనేది మనం గమనించవచ్చు
మత స్వేచ్చ, సమానత్వం మరియు న్యాయం.. వీటిని ఆచరణాత్మకంగా అమలు పరచడం ద్వారా మన సమాజ శ్రేయస్సుకి, దేశాభివృద్ధికి ఎంతో అవసరమైన శాంతి, సామరస్యం మరియు పరస్పర అవగాహనలను సాధించగలమనడంలో ఏ మాత్రం సందేహం లేదు.
ఐకమత్యమే మహా బలం! జై హింద్!