More

    Choose Your Language

    దేవుడు ఉన్నాడా?

    విశ్వానికి ఒక నిర్ణీత వయసు ఉంది, తద్వారా దానికి ఒక ఆది ఉందని మనకు తెలుస్తుంది. ఒకానొకప్పుడు ఉనికిలోకి వచ్చిన విశ్వం తనను తాను సృష్టించుకొని అయినా ఉండాలి లేదా దేని ద్వారా అయినా సృష్టించబడి అయినా ఉండాలి. ఏదైనా కానీ తనను తాను సృష్టించుకోలేదు గనుక, విశ్వానికి ఒక సృష్టికర్త ఉన్నాడని మనకు అర్ధం అవుతుంది. ఈ సృష్టికర్తనే మనం దేవుడు అంటున్నాము.

    దేవుడు ఎవరు?

    ఈ విశ్వాన్ని, అందులో ఉన్న సమస్తాన్నీ సృష్టించినవాడే దేవుడు.

    ఈ విశ్వానికి ఒక సృష్టికర్త ఉన్నాడా అనేది పరిశీలిద్దాం…

    విశ్వం అనంతంగా ఉండినదా లేక దానికి ఆరంభం ఉందా?

    ఈ విశ్వం యొక్క వయస్సు 13.8 బిలియన్ సంవత్సరాలని శాస్త్రజ్ఞులు అంటున్నారు. ఒకవేళ విశ్వం అనంతంగా ఉండి ఉన్నట్లయితే, దాని వయస్సు కొలవగలమా? కాదు కదా? ఉదాహరణకు మీరు పుట్టుక అనేది లేకుండా, అనంతంగా ఉండి ఉన్నట్లయితే మీకు ఒక వయసు అనేది ఉంటుందా? ఈ విశ్వానికి వయస్సు అనేది ఉండడమే దానికి ఒక ఆరంభం ఉందనడానికి సాక్ష్యం.

    ఈ విశ్వం యొక్క సృష్టి ఎలా జరిగిందనేది సైన్స్(విజ్ఞాన శాస్త్రం) మనకు చెపుతుందా?

    నాస్తికులు ప్రతీ విషయంలోనూ సైన్స్ వివరణలనే నమ్ముతారు. విశ్వం యొక్క ఆరంభాన్ని సైన్స్ వివరించగలదా అనేది అర్ధం చేసుకోవడానికి ముందుగా మనం అసలు సైన్స్ అంటే ఏమిటో తెలుసుకోవాలి

    విజ్ఞాన శాస్త్రము (సైన్స్) అంటే – ప్రాకృతిక దృగ్విషయాలను పరిశీలన మరియు ప్రయోగాల ద్వారా అభ్యసించడం

    Oxford Dictionary

    సైన్సు విశ్వం లోపల పని చేస్తుంది, దాని బయట కాదు. విశ్వ ఆవిర్భావం తరువాతి విషయాలను అది వివరించగలదు, ముందువి కాదు. విశ్వం యొక్క కారణం విశ్వానికి ముందు, దానికి వెలుపల ఉంటుంది. దానిని సైన్సు వివరించలేదు ఎందుకంటే విశ్వమే లేనప్పుడు – ప్రాకృతిక విషయాలు ఉండవు, పరిశీలనా ఉండదు, ప్రయోగమూ సాధ్యం కాదు.. అంటే విశ్వ ఆవిర్భావాన్ని వివరించడానికి సైన్సు పనికిరాదు. అంటే ఈ విషయం సైన్సు పరిధిలోనే లేదు. భవిష్యత్తులోనే కాదూ, ఎప్పటికీ సైన్సు దీనిని వివరించడం సాధ్యం కాదు.

    విశ్వ ఆవిర్భావం యొక్క కారణం సైన్సు ద్వారా తెలుసుకోలేము కనుక తార్కికంగా (లాజిక్) ద్వారా దానిని తెలుసుకోవడానికి ప్రయత్నం చెయ్యాలి.

    విశ్వ ఆవిర్భావానికి తార్కిక వివరణ

    విశ్వ ఆవిర్భావానికి ఉన్న సంభావ్యతలను తర్కం ద్వారా యోచిద్దాము. విశ్వ ఆవిర్భావానికి రెండే రెండు సంభావ్యతలు ఉన్నాయి

    1. విశ్వం తనను తాను సృష్టించుకొని ఉండాలి
    2. విశ్వం దేని ద్వారా అయినా సృష్టించబడి ఉండాలి

    పై రెండు సంభావ్యతలను విశ్లేషిద్దాము

    విశ్వం తనను తాను సృష్టించుకోగలదా?

    అస్తిత్వంలో లేని ఏదైనా వస్తువు తనను తాను సృష్టించుకోగలదా? లేదు కదా? “నువ్వు నీకే పుట్టావు” అంటే అర్ధం ఉంటుందా? “విశ్వం తనను తాను సృష్టించుకుంది” అనడం కూడా “నువ్వు నీకే పుట్టావు” అనడంతో సమానమే. అందుకని విశ్వం తనను తాను సృష్టించుకోలేదు.

    ఏదో ‘ఒక శక్తి’ విశ్వాన్ని సృష్టించింది

    విశ్వానికి కారణభూతమైనది ఏదైనా ఉండి ఉండాలి. మనకు ఇప్పుడు మిగిలి ఉన్న సంభావ్యత ఇది ఒక్కటే. దానినే మనం దేవుడు, సృష్టికర్త అని అంటున్నాము. ఇలా అనగానే కొంతమందికి వచ్చే సందేహం… మరి ఆ దేవుడిని ఎవరు సృష్టించారు? అనేది.. దీనికి కూడా చర్చిద్దాము…

    దేవుడిని ఎవరు సృష్టించారు?

    ఒక వస్తువు యొక్క ఆది, అంతాలను నిర్ధారించడానికి మనం సమయాన్ని ఉపయోగిస్తాము. ఒకవేళ సమయమే లేకపోతే, ఆది-అంతాలు అనేవే ఉండవు. ఈ విశ్వంలోనీ ప్రతీదీ సమయం మీద ఆధారపడి ఉంది అందుకనే ప్రతీ దానికీ ఆది, అంతము అనేవి ఉన్నాయి.

    ఈ విశ్వం వలే, సమయం అనేది కూడా ఉనికిలోకి వచ్చిన అస్తిత్వమే… అంటే దానికి కూడా ఆది (ప్రారంభం) అనేది ఉంది. ఈ విశ్వం వలే సమయానికి కూడా ఒక కారణం అనేది ఉండాలి ఎందుకంటే సమయం అనేది తనను తాను సృష్టించుకోలేదు (దీనినే కార్యాకారణ సంబంధం అంటారు). విశ్వానికి సృష్టికర్త అయిన దేవుడే సమయానికి కూడా సృష్టికర్త. ఎందుకంటే దేవుడు సమయానికి లోబడి ఉంటే అతడికి కూడా ఒక ఆది (ప్రారంభం) అనేది ఉండి ఉండేది, దేవుడికి ప్రారంభం అనేది ఉంటే దానికి కూడా మరలా ఒక కారణం ఉండి ఉండేది మరియు ఆ కారణానికి కూడా మరలా మరో కారణం ఉండి ఉండేది..ఎందుకంటే ప్రతీదీ సమయం లోపలే జరగాలి. ఈ కారణాల గొలుసుకు అంతం లేకపోతే అది అనంతంగా ఉండి ఉండి అసలు ఈ విశ్వం యొక్క సృష్టే జరిగి ఉండేది కాదు. దీనిని ఒక ఉదాహరణ ద్వారా అర్ధం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాము..

    A అనేవాడు ఒక జాలరి మరియు అతడు చేపలు పట్టడానికి B అనేవాడి అనుమతి కావాలి.

    B అనే వాడికి C అనేవాడి అనుమతి కావాలి.

    C అనే వాడికి D అనేవాడి అనుమతి కావాలి.

    D అనే వాడికి E అనేవాడి అనుమతి కావాలి.

    E అనే వాడికి F అనేవాడి అనుమతి కావాలి.

    F అనే వాడికి G అనేవాడి అనుమతి కావాలి.

    …..

    ఇది ఇలా అనంతంగా సాగితే A అనే వాడికి అసలు చేపలు పట్టే అనుమతి ఎప్పటికైనా లభిస్తుందా?

    ఇదే విధంగా, ఒకవేళ దేవుడు సమయాధీనుడయి ఉంటే, కార్యా కారణ సంబంధాలు లేదా కారణాల గొలుసు అనంతంగా సాగి, ఈ విశ్వ సృష్టి అనేదే జరిగి ఉండేది కాదు. దీనినే అనంత తిరోగమన సమస్య అని కూడా అంటారు. కానీ ఈ విశ్వం సృష్టించబడింది అనేది ఒక సత్యం. అందుకని ఈ విశ్వ సృష్టికర్త అయిన దేవుడు సమయానికి అతీతమైన వాడు మరియు సమయానికే కారణభూతుడు.

    సమాయానికి అతీతమైన దేవుడికి ఆద్యంతాలు ఉండజాలవు. అందుకని దేవుడిని ఎవరు సృష్టించారు? అని అడగడం అర్ధ రహితమైనది.

    సారాంశం

    1. విశ్వం యొక్క వయస్సు నిర్ధారించబడింది, విశ్వానికి ఆది ఉందని తద్వారా తెలుస్తుంది.
    2. విశ్వం తనను తాను సృష్టించుకోగలగడం అనేది అసంభవం. అది వేరే ‘ఒక శక్తి’ ద్వారా సృష్టించబడిందని అర్ధం అవుతుంది.
    3. ఈ శక్తినే మనం ‘దేవుడు’ అంటున్నాము
    4. విశ్వం వలే, సమయం కూడా ఉనికిలోకి వచ్చిన అస్తిత్వమే
    5. దేవుడు సమయావధిలో ఉండజాలడు, ఎందుకంటే అది అనంత తిరోగమన సమస్యకు దారితీసి విశ్వ ఆవిర్భావమే సంభవించదు.
    6. దేవుడు సమయానికి అతీతుడు, అందుకని అతడికి ఆది-అంతాలు లేవు
    7. దేవుడిని ఎవరు సృష్టించారు? అని అడగడం అర్ధరహితం ఎందుకంటే దేవుడికి ఆది లేదు.


    మీకు ఆసక్తి కలిగించే ఇతర వ్యాసాలు

    WHAT OTHERS ARE READING

    Most Popular