హిందువులను చంపమని ఖురాన్ ఆదేశిస్తుందని, అందుకని ముస్లిముల వలన హిందువులకు ప్రమాదం పొంచి ఉందని కొంత మంది ప్రచారం చేస్తూ ఉంటారు. ఇది ఎంత వరకు నిజమో తెలుసుకుందాం.
ముందుగా, హిందువు అనే పదం ఖురానులో ఎక్కడా లేదు. అవిశ్వాసులను లేదా ముస్లిమేతరులను చంపమని ఉన్న కొన్ని వాక్యాలను వారు ప్రస్తావిస్తూ ఉండవచ్చు.
వాక్యం మరియు సందర్భం
భగవద్గీత
శ్రీకృష్ణుడు ఇలా అంటున్నాడు – “ఈ భౌతిక శరీరము మాత్రమే నశించునది; కానీ అందున్న జీవాత్మ నాశరహితమైనది, కొలవశక్యము కానిది మరియు సనాతనమైనది (నిత్యమైనది). కావున, ఓ భరత వంశీయుడా, యుద్ధం చేయుము.”
భగవద్గీత 2:18
యుద్ధం చేస్తే నీవు, యుద్ధ రంగంలో వీర మరణం పొంది స్వర్గానికి పోయెదవు లేదా విజయుడవై ఈ రాజ్యమును అనుభవించెదవు. కావున, కృత నిశ్చయుడవై లెమ్ము, ఓ కుంతీ పుత్రుడా, యుద్ధానికి తయారుకమ్ము
భగవద్గీత 2:37
అధర్వ వేదం
ఓ వేద వాణీ! వేదములను విమర్శించు వానిని నరికి వేయుము! చీల్చి వేయుము, ఖండించి వేయుము, కాల్చి వేయుము, అగ్నిలో పడవేసి బూడిద కానివ్వుము.
అధర్వ వేదం 12/5/62
పై శ్లోకాలను వాటి సందర్భం నుండి వేరు చేసి చూస్తే ఎలా ఉంటుంది?
పై శ్లోకాలను వాటి సందర్భాన్ని ప్రస్తావించకుండా అర్ధం చేసుకుంటే, భగవద్గీత, వేదాలు హింసను, యుద్ధాన్ని ప్రేరేపిస్తున్నట్లు అనిపిస్తుంది. అదే ఆ శ్లోకాలను సందర్భానుసారంగా చదివితే అవి ధర్మానికి అధర్మానికి మధ్య జరుగుతున్న పోరాటం గురించి చెపుతున్నాయని అర్ధం అవుతుంది. అందుకని, శ్లోకాల సందర్భం అనేది చాలా ముఖ్యమైనది.
ఖురాను వాక్యాల సందర్భం
ఖురాను వాక్యాలను సందర్భానుసారంగా చదివితే, ఖురాన్ హింసను, విద్వేషాన్ని ప్రేరేపించదని అర్ధం అవుతుంది. సందర్భ రహితంగా ప్రస్తావించబడే కొన్ని వాక్యాలను ఇప్పుడు పరిశీలిద్దాము
1. వారు మీకు ఎక్కడ ఎదురైతే అక్కడనే వారిని చంపండి..
ఇది ఖురానులోని 2వ అధ్యాయం లోని 191 వ వాక్యం లోనిది. ఇవి ఆ వాక్యాలలో ఒక భాగం మాత్రమే. దానికి ముందు వెనుక ఉన్న వాక్యాలను చదివి, సందర్భం అర్ధం చేసుకుందాం.
మరియు మీతో పోరాడేవారితో, మీరు అల్లాహ్ మార్గంలో పోరాడండి, కాని హద్దును అతిక్రమించకండి. నిశ్చయంగా, అల్లాహ్ హద్దులను అతిక్రమించేవారిని ప్రేమించడు.
ఖుర్ఆన్ 2:190
వారు, మీకు ఎక్కడ ఎదురైతే అక్కడనే వారిని చంపండి. మరియు వారు మిమ్మల్ని ఎచ్చటినుండి తరిమివేశారో, మీరు కూడా వారిని అచ్చటి నుండి తరిమివేయండి. మరియు సత్యధర్మానికి అడ్డుగా నిలవటం, చంపటం కంటే ఘోరమైనది. మస్జిద్ అల్-హరామ్ వద్ద వారు మీతో యుధ్ధం చేయనంతవరకు మీరు వారితో అక్కడ యుధ్ధం చేయకండి. ఒకవేళ వారే మీతో (ఆ పవిత్ర స్థలంలో) యుద్ధం చేస్తే వారిని వధించండి. ఇదే సత్యతిరస్కారులకు తగిన శిక్ష.
ఖుర్ఆన్ 2:191
కానీ, వారు (యుద్ధం చేయటం) మానుకుంటే (మీరు కూడా మానుకోండి). ఎందుకంటే నిశ్చయంగా, దేవుడు క్షమా శీలుడు, అపార కరుణాప్రదాత.
ఖుర్ఆన్ 2:192
మరియు పీడన ముగిసిపోయే వరకు మరియు దేవుని ధర్మం మాత్రమే స్థాపించబడే వరకు మీరు వారితో యుధ్ధం చేస్తూ ఉండండి. ఒకవేళ వారు మానుకుంటే, దుర్మార్గులతో తప్ప ఇతరులతో పోరాడకండి.
ఖుర్ఆన్ 2:193
తమతో పోరాడిన వారితో, తమను పీడించిన వారితో మాత్రమే పోరాడమని చెప్పబడిందే గానీ, ముస్లిమేతరులందరినీ చంపమని చెప్పబడలేదని సులభంగా అర్ధం అవుతుంది.
2. “ఇక నిషిద్ధ మాసాలు గడిచిపోయిన తరువాత బహుదైవారాధకులను, ఎక్కడ దొరికితే అక్కడ వధించండి. మరియు వారిని పట్టుకోండి మరియు చుట్టుముట్టండి మరియు ప్రతి మాటు వద్ద వారికై పొంచి ఉండండి”
ఇది ఖురానులోని 9వ అధ్యాయం లోని 5వ వాక్యం లోనిది. ఇవి ఆ వాక్యాలలో ఒక భాగం మాత్రమే. దానికి ముందు, తరువాత ఉన్న వాక్యాలను చదివి, సందర్భం అర్ధం చేసుకుందాం.
..కాని ఏ బహుదైవారాధకులతోనైతే మీరు ఒడంబడికలు చేసుకొనిఉన్నారో, వారు మీకు ఏ విషయంలోను లోపం చేయక, మీకు వ్యతిరేకంగా ఎవరికీ సహాయం చేయకుండా ఉంటే! వారి ఒడంబడికను దాని గడువు వరకు పూర్తి చెయ్యండి. నిశ్చయంగా, దేవుడు దైవభీతి గలవారిని ప్రేమిస్తాడు.
ఖుర్ఆన్ 9:4
ఇక్కడ సందర్భం ఏమిటంటే, ఆ కాలంలో ముస్లిములు అనేక వర్గాలతో (క్రైస్తవులు, యూదులు, బహుదైవారాధకులతో) శాంతి ఒడంబడికలు చేసుకుని ఉన్నారు. ఆ శాంతి ఒడంబడికలను కొంత మంది అతిక్రమించి ముస్లిములను చంపివేశారు. ఒడంబడికలను అతిక్రమించని వారితో చేసుకున్న ఒప్పందాలను పాలించమని (9:4), ఒడంబడికను అతిక్రమించి, ముస్లిములను హతమార్చిన వారితో పోరాడండని (9:5) ముస్లిములకు తాకీదు చెయ్యడం జరిగింది. ఇంకా దీని తరువాతి శ్లోకంలో ఏముందో చూడండి. యుద్ధరంగంలోనైనా శరణుగోరిన వారిని రక్షించమని ఉంది.
…మరియు బహుదైవారాధకులలో ఎవడైనా నీ శరణుకోరితే – అతడు దేవుడి గ్రంథాన్ని (ఖుర్ఆన్ ను) వినటానికి – అతడికి శరణు ఇవ్వు. తరువాత అతడిని, అతడి కొరకు సురక్షితమైన స్థలానికి చేర్చు. ఇది ఎందుకంటే! వాస్తవానికి, వారు (సత్యం) తెలియని ప్రజలు.
ఖుర్ఆన్ 9:6
ఖురాన్ శాంతిని ప్రోత్సహిస్తుంది
శత్రువు: శాంతిని కోరుకుంటే దానిని వెంటనే ప్రసాదించమని ఖురానులో స్పష్టంగా చెప్పబడి ఉంది
కాని ఒకవేళ వారు శాంతివైపుకు మొగ్గితే నీవు కూడా దానికి దిగు మరియు దేవుడిపై ఆధారపడు. నిశ్చయంగా ఆయన సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు.
ఖుర్ఆన్ 8:61
ఒక ముస్లిం ముస్లిమేతరులతో ఎలా ప్రవర్తించాలి?
దేవుడు ఖురాన్ గ్రంధంలో ఇలా తెలియజేస్తున్నాడు:
ఎవరైతే ధర్మవిషయంలో మీతో యుద్ధం చేయరో మరియు మిమ్మల్ని మీ గృహాల నుండి వెళ్ళగొట్టరో! వారి పట్ల మీరు సత్ప్రవర్తనతో మరియు న్యాయంతో వ్యవహరించటాన్ని దేవుడు నిషేధించలేదు. నిశ్చయంగా దేవుడు న్యాయవర్తనులను ప్రేమిస్తాడు
60:8
పై వాక్యంలో, సత్ప్రవర్తనకు అరబీలో వాడబడిన పదం “తబర్రు”. దీని మూల పదం “బిర్ర్”. బిర్ర్ అనేది అత్యంత కారుణ్యం, ప్రేమ, దయ, ఉపకార గుణం, న్యాయం చేయడం లాంటి సుగుణాలను సూచిస్తుంది. ఉదాహరణకు తల్లిదండ్రులతో వ్యవహరించవలసిన తీరును సూచించడానికి కూడా ఈ పదం వాడబడింది (బిర్రుల్ వాలిదైన్). ముహమ్మద్ ప్రవక్త కూడా ఈ “బిర్రుల్ వాలిదైన్” అనే పదాన్ని తల్లిదండ్రుల పట్ల పాటించవలసిన ప్రవర్తనను వివరించడానికి వాడారు.
అంటే, దేవుడు “తబర్రు” అనే పదం వాడి, ముస్లిములు తమ సొంత తల్లిదండ్రుల పట్ల ఎంత ప్రేమను కలిగి ఉంటారో, అంతే ప్రేమ ముస్లిమేతరుల పట్ల కూడా కలిగి ఉండాలని ఆదేశిస్తున్నాడు.
అలాంటప్పుడు హిందువులను చంపమని ఖురాన్ బోధిస్తుందనడం సమంజసమా?
ముహమ్మద్ ప్రవక్త ఇలా అన్నారు:
ఒకరికొకరు కనికరం చూపనంత వరకు మీరు నిజమైన విశ్వాసులు కాలేరు. ప్రవక్త అనుచరులు ఇలా అన్నారు: “మేమంతా కనికరం చూపిస్తాం”. ముహమ్మద్ ప్రవక్త ఇలా బదులిచ్చారు: “కేవలం మీ మిత్రులకు చూపించే కనికరం, దయాగుణం కావు, మీరు ప్రజలందరితోనూ అలాగే ఉండాలి తిర్మిదీ
ప్రవక్త ప్రవచనాల సంకలనం
ఖురాన్ మరియు ముహమ్మద్ ప్రవక్త ప్రవచనాలను పరిశీలిస్తే, ఒక ముస్లిం ముస్లిమేతరులతో దయతో, ప్రేమతో, న్యాయంతో వ్యవహరించమని మాత్రమే బోధించబడిందనే సత్యం తెలుస్తుంది.
మీరు స్వీయ పరిశీలన ఎందుకు చేయరు?
ముస్లిమేతర సోదర సోదరీమణులకు విజ్ఞప్తి! ఖురాన్ అనువాదాలు ఆన్లైన్లో ఉన్నాయి, ఆఫ్లైన్లో కూడా ఉన్నాయి. మీరు ఎప్పుడైనా ఖురాను గురించి చెడుగా వినినప్పుడు, ఆ వాక్యాలను, దానికి వెనుక ముందు ఉన్న వాక్యాలను ఖురానులో చదివి సందర్భం అర్ధం చేసుకోండి.విద్వేష ప్రచారాలను నమ్మకండి!