భారతీయ ముస్లిముల దగ్గర వారి దేశభక్తికి నిదర్శనం ఉంది.
మన దేశంలో తమ దేశభక్తిని నిరూపించుకోగల వర్గం ఏదైనా ఉందంటే అది కేవలం ముస్లిములది మాత్రమే. అదెలాగంటే భారతీయ ముస్లిముల దగ్గర దేశ విభజన సమయంలో పాకిస్తాన్ ను లేదా ఇండియాను ఎంచుకోవాల్సిన సందర్భం ఎదురయ్యింది. అత్యధిక ముస్లిములు (కోట్ల కొద్దీ) భారత దేశం మీద ప్రేమతో, ఇక్కడే ఉండడానికి నిశ్చయించుకున్నారు. వారి దేశభక్తికి ఇంతకన్నా నిదర్శనం మరొకటి కావాలా?
భారత దేశ స్వాతంత్ర ఉద్యమంలో ముస్లిముల పాత్ర
ఎంతో మంది ముస్లిములు భారత దేశ స్వాతంత్ర ఉద్యమం కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టారు.
మీకిది తెలుసా?
1. మన దేశ స్వాతంత్ర సంగ్రామంలో ఎంతో ముఖ్యమైన “క్విట్ ఇండియా”, “సైమన్ గో బ్యాక్” అనే నినాదాలకు కర్త యూసుఫ్ మెహర్ అలీ అనే ఒక ముస్లిము.
ఆధారం: https://scroll.in/article/846450/who-coined-the-slogan-quit-india-it-wasnt-gandhi
2. నేతాజీ సుభాష్ చంద్ర బోస్ గారి నోట అను నిత్యం నానిన “జై హింద్” నినాదానికి కర్త కూడా జైనుల్ అబ్దీన్ హసన్ అనే ఒక ముస్లిమే. హసన్ నేతాజీ సుభాష్ చంద్ర బోస్ గారు స్థాపించిన ఇండియన్ నేషనల్ ఆర్మీ I.N.A.లో సేనాపతి కూడా.
ఆధారం: https://www.thehindu.com/todays-paper/tp-in-school/who-coined-jai-ind/article5723442.ece
3. అమర వీరుడు భగత్ సింఘ్ కు స్ఫూర్తిగా నిలిచిన “ఇన్ ఖిలాబ్ ౙిందాబాద్” అనే నినాదానికి కర్త కూడా ఒక ముస్లిమే, ఆయన పేరు మౌలానా హస్రత్ మోహని.
ఆధారం: https://sabrangindia.in/ann/inquilab-zindabad-who-coined-term
4. స్వాతంత్ర సంగ్రామ సమయంలో “సారే జహా సే అచ్చా, హిందుస్తాన్ హమారా” అని ప్రతీ ఒక్కరూ తన్మయత్వంతో పాడిన పాటను రచించింది కూడా ముహమ్మద్ ఇక్బాల్ అనే ఒక ముస్లిం కవే.
ఈ రోజుకి కూడా భారతీయ సైన్యం మరియు నౌకా దళాలు వారి ముగింపు వేడుకల్లో ఈ దేశభక్తి గీతాన్ని ఆలపించడం జరుగుతుంది.
భారత దేశ స్వాతంత్ర ఉద్యమంలో పాలు పంచుకున్న ముస్లిం ప్రముఖులు
భారతదేశ స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్న ముస్లిముల సంఖ్య ఎంత పెద్దది అంటే, దాని కోసం ఒక పుస్తకం వ్రాయవలసి ఉంటుంది మరియు అది వ్రాయబడింది కూడా. శాంతిమోయ్ రాయ్ గారు సంకలనం చేసిన “స్వాతంత్ర సంగ్రామం – భారతీయ ముస్లిములు” (Freedom Movement and Indian Muslims) అనే పుస్తకం నేషనల్ బుక్ ట్రస్ట్ ఢిల్లీ వారి ద్వారా ప్రచురించబడింది. దయచేసి ఒకసారి చదవండి.

జల్లియన్ వాలా బాగ్ అమర వీరుల చిట్టా – మనకు చెప్పేది ఏమిటి?
మన దేశ స్వాతంత్ర సంగ్రామంలో జరిగిన మరిచిపోలేని, క్రూరమైన ఘటన జల్లియన్ వాలా బాగ్ఊచకోత. స్వాతంత్ర సంగ్రామంలో భారతీయ ముస్లిముల పాత్రను ప్రశ్నించే వారు ఈ సంఘటనలో అసువులు బాసిన అమరవీరుల చిట్టాను గమనించాలి.
పంజాబ్ లో పనిచేసిన బ్రిటీషు అధికారులు ఈ ఘటనలో అమరులైన, గాయపడిన వారి పేర్లను నమోదు చేసారు. పంజాబ్ లోని బ్రిటీషు ప్రభుత్వ హోం శాఖలో ఈ చిట్టా 4 పేజీల రూపంలో దొరికింది. ఇందులో హిందూ, ముస్లిం, సిక్కుల పేర్లు ఉన్నాయి.

జల్లియన్ వాలా బాగ్ సంఘటన హిందూ ముస్లిములు ఎలా ఐకమత్యంతో పోరాడారన్న సత్యాన్ని కూడా మన ముందు ఉంచుతుంది. ఇదే కదా దేశభక్తి అంటే! దీనికి భిన్నంగా బ్రిటీష్ ప్రభుత్వాన్ని క్షమాభిక్ష కోరుతూ ఉత్తరాలు వ్రాసిన వారి గురించి ఆలోచించండి. వారి అనుచరులే ఇప్పుడు ముస్లిముల దేశభక్తిని ప్రశ్నిస్తుండడం విడ్డూరం.
ఆధారం: https://thewire.in/history/bhagat-singh-and-savarkar-a-tale-of-two-petitions
భారతీయ ముస్లిములు పాకిస్తాన్ ను ప్రేమిస్తారా?
చాలా మంది భారత ముస్లిములు పాకిస్తాన్ కు మద్దతు పలుకుతారని కొంత మంది అనుమానం. ఇద్దరూ ఇస్లాం మతాన్ని ఆచరించే వారు కాబట్టి, భారతీయ ముస్లిములు పాకిస్తాన్ వారంటే ఇష్టంతో ఉంటారని వీరు భావిస్తారు. అవకాశం దొరికినప్పుడల్లా భారతీయ ముస్లిములపై అటువంటి నిందలు మోపి వారిని అవమాన పరుస్తుంటారు. అంతేకాదు, “మీరు పాకిస్తాన్ పొండి” అని ఆవేశంతో అరిచే వాళ్ళను కూడా మనం చూడవచ్చు.
భారతీయ ముస్లిములు పాకిస్తాన్ ను అంతగా ప్రేమిస్తే, వారు ఇక్కడే ఉండడానికి ఎందుకు నిర్ణయించుకున్నారు? ఇక్కడి ప్రభుత్వానికి ఎందుకు పన్నులు చెల్లిస్తున్నారు?
అవును, ఇద్దరూ ఇస్లాం మతాన్ని అవలంబిస్తారు కానీ ఇక్కడ ఉండేవారు భారతీయ ముస్లిములు, అక్కడ ఉండేవారు పాకిస్తాన్ ముస్లిములు. అమెరికాలో ఉండేవారు అమెరికా ముస్లిములు…అంతే!
కేవలం ఇస్లాం మతం కారణంగా ఒక భారతీయ ముస్లిము పాకిస్తాన్ వెళ్ళి అక్కడ వోటు వెయ్యలేడు సరికదా అక్కడ ఒక చిన్న స్థలం కూడా కొనలేడు, పాకిస్తాన్ పౌరులకుండే ఎటువంటి హక్కులు ఇతడికి ఉండవు. పాకిస్తాన్ వాయుసేనలు ఒక బాంబు వేస్తే ఇస్లాం కారణంగా అవి భారతీయ ముస్లిములను చంపకుండా ఉండవు. బుద్ధి ఉన్న భారతీయ ముస్లిములందరూ దీనిని అర్ధం చేసుకుంటారు మరియు వారు ఎల్లప్పుడూ తమ మాతృభూమి అయిన భారత్ కు అండగా ఉంటారు.
మత విశ్వాసం మరియు దేశభక్తి
మత విశ్వాసం మరియు దేశభక్తులను జత చేసి చూడడం ఒక పెద్ద తప్పు. ఉదాహరణకు నేపాల్ ని చూడండి. ప్రపంచంలో ఉన్న ఒకే ఒక హిందూ దేశం అది. అందుకని అది హిందువులు అత్యధిక సంఖ్యలో ఉన్న మన దేశంతో సత్సంబంధాలు కలిగి ఉండాలి.. కానీ అలా జరుగుతుందా? అనేక సార్లు నేపాల్ మన దేశాన్ని ధిక్కరించింది. దీనికి సంబంధించి కొన్ని వార్తలను పరిశీలించండి.
1. “ఇండియాను ధిక్కరించిన నేపాల్, చైనాతో సైనిక విన్యాసాలు”
ఆధారం:https://eurasiantimes.com/nepal-snubs-india-military-exercise-china/
2. “ఇండియాను ధిక్కరించిన నేపాల్, నిరసనల మధ్య కొత్త రాజ్యాంగానికి ఆమోదం”
3. “ఇండియాను ధిక్కరించిన నేపాల్, చైనా తో రైల్వే ఒప్పందానికి సంతకాలు”
4. “ఇండియాను ధిక్కరించిన నేపాల్ ప్రధాని, ముందు చైనా పర్యటన”
ఆధారం: http://www.rediff.com/news/report/nepal-pm-snubs-india-to-visit-china-first/20151230.htm
ఇలాంటి వార్తలు మనం అనేకం చూడవచ్చు. దీని ద్వారా నేపాల్ మన దేశం కన్నా చైనాతో సంబంధాలను పటిష్టం చేసుకుంటుందని అర్ధం అవుతుంది. ఒక హిందూ దేశం అయిన నేపాల్ మన దేశాన్ని కాదని కమ్యూనిష్టు దేశమైన చైనా వైపు ఎందుకు మొగ్గు చూపుతుంది? దీనికి జవాబు ఏమిటంటే ఇది రాజకీయాలు మరియు దేశ ప్రయోజనాలకు సంబంధించిన విషయం. మత విశ్వాసాలు వేరు, దేశ ప్రయోజనాలు వేరు. ఇదే సూత్రం భారతీయ ముస్లిములు మరియు పాకిస్తాన్ కు కూడా వర్తిస్తుంది.
భారతీయ ముస్లిములు మరియు క్రికెట్
భారతీయ ముస్లిములు క్రికెట్ ఆటలో పాకిస్తాన్ గెలవడాన్ని ఇష్ట పడతారని కాబట్టి వారికి దేశభక్తి లేదని చాలా మంది భావిస్తారు. ఇది సరాసరి తప్పు., భారతీయ ముస్లిములు మన దేశ జట్టునే ఇష్ట పడతారు, గెలవాలని కోరుకుంటారు.
ఇక్కడ మనం మరొక విషయాన్ని కూడా అర్ధం చేసుకోవాలి. ఒక ఆటను దేశభక్తికి కొలబద్దగా పరిగణించడం అనేది తప్పు. ఆటగాళ్ళు ఆట మీద ప్రేమతో మరియు డబ్బుల కోసం ఆడతారు., ప్రేక్షకులు వినోదం కోసం దానిని చూస్తారు. క్రికెట్ కూడా అలాంటి ఒక ఆటే కదా? మనం గమనిస్తే, కేవలం క్రికెట్ ఆటనే దేశభక్తికి కొలబద్దగా ఉపయోగిస్తుంటారు. మిగతా ఆటల విషయంలో దీనిని పట్టించుకోరు. ఉదాహరణకు, F1 కార్ రేసింగ్లో మన దేశ జట్టయిన “ఫోర్స్ ఇండియా” కు బదులు “రెడ్ బుల్” లేదా “మెక్ లారెన్ మెర్సిడెస్” జట్టులను సమర్థించే హిందువులను ఏమనాలి? వీరికి దేశభక్తి లేదని నిందించవచ్చా?
పాకిస్తాన్ కు సంబంధించిన ఏ విషయమైనా మనం వదిలివెయ్యాలి, పట్టించుకోకూడదు, సమర్థించకూడదు అంటే, నుస్రత్ ఫతెహ్ అలీ ఖాన్, అతిఫ్ అస్లం మొదలైన పాకిస్తాని సంగీత విద్వాంసులు, గాయకుల పాటలను ఇష్టపడే హిందువుల గురించి ఏమనాలి? వారి దేశభక్తిని శంకించవచ్చా? సంగీతానికి, ఆటలకు మధ్య ఈ తేడా ఎందుకు?
ఆటలు, సంగీతం, కళలు మొదలైన వాటికి ఎల్లలు, సరిహద్దులు ఉండవు. వాటిని ఒకరి దేశభక్తికి ప్రామాణికంగా, కొలబద్దగా వాడడం అనేది తప్పు అని అర్ధం చేసుకోవాలి.
భారతీయ ముస్లిముల దేశభక్తిని ప్రశ్నించే ప్రచారాలు అవాస్తవాలని మీకు బాగా అర్ధం అయిందని భావిస్తున్నాము.