More

  Choose Your Language

  మరణం తరువాత మరలా జీవితం ఉందా?

  ఈ ప్రపంచంలో సంపూర్ణ న్యాయం సాధ్యమా? హిట్లర్ దాదాపు 60 లక్షల మంది యూదులను చంపాడు, అతడిని సజీవంగా పట్టుకుని ఉన్నా అతడికి మన న్యాయస్థానాలు ఎలాంటి శిక్షను విధించగలవు? మరణ శిక్ష విధించినా అది కేవలం ఒక యూదుని హత్యకు బదులుగా శిక్షించినట్టవుతుంది. మరి మిగతా వారి సంగతేమిటి?

  నేను మరణించిన తరువాత ఏమి జరుగుతుంది? అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మనం మరణించిన తరువాత ఏమి జరుగుతుంది? మన అస్తిత్వం అంతటితో అంతం అయిపోతుందా? లేక మరణానికి తరువాత మరలా జీవితం ఉంటుందా? ఇది అర్ధం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం..

  మరణం తరువాత మరలా జీవితం ఉందా లేదా అని తెలుసుకోవడానికి ముందు మనం అసలు అది అవసరమా? అనేది పరిశీలిద్దాము.

  మరణం తరువాత మరలా జీవితం అవసరమా?

  ఏ దేశం, జాతి, మతం వారమైనా మానవులుగా మనం న్యాయాన్ని కాంక్షిస్తాము. అందుకనే ప్రతీ దేశంలోనూ న్యాయాన్ని నెలకొల్పడానికి వివిధ సంస్థలు ఉన్నాయి. ఉదాహరణకు – పోలీసులు, చట్టాలు, కోర్టులు మొదలైనవి.

  అయితే ఈ లోకంలో సంపూర్ణ న్యాయం సాధ్యమా? అనేది ముందుగా పరిశీలిద్దాము..

  హిట్లర్ దాదాపు 60 లక్షల మంది యూదులను చంపాడు, అతడిని సజీవంగా పట్టుకుని ఉన్నా అతడికి మన న్యాయస్థానాలు ఎలాంటి శిక్షను విధించగలవు? మరణ శిక్ష విధించినా అది కేవలం ఒక యూదుని హత్యకు బదులుగా శిక్షించినట్టవుతుంది. మరి మిగతా వారి సంగతేమిటి?

  ఆత్మాహుతి దాడుల ద్వారా తనతో పాటు కొన్ని వందల మందిని చంపే వారికి శిక్ష విధించడం ఎలా? మరణించిన వాడికి శిక్ష ఏమిటి? మరి అతని చేతిలో బలి అయిన అమాయకులకు న్యాయం జరిగేదెలా?

  కొన్ని కేసులలో న్యాయమూర్తి ఒక ముద్దాయికి అనేక యావజ్జీవ కారాగార శిక్షలు విధించడం మనం చూస్తాము. ఒకోసారి అతడి నేరాలను బట్టి ఆ శిక్ష 100 సంవత్సరాలకు పైబడి కూడా ఉండవచ్చు, అయితే నిజంగా అతడు అన్ని సంవత్సరాలు బ్రతుకుతాడా? అలా జరగని పక్షంలో అతడి విషయంలో సంపూర్ణ న్యాయం జరిగినట్టు కాదు కదా?

  సంపూర్ణ న్యాయం అంటే హతులకు లేదా బాధితులకు నష్ట పరిహారం కూడా అందాలి. చనిపోయిన వారికి నష్ట పరిహారం ఎలా ఇవ్వగలం?

  అనేక మంది మంచి వారు ఇక్కడ బాధలు అనుభవిస్తున్నారు. అనేక మంది అమాయకులు, సద్వర్తనులు హింసించబడి, చంపివేయబడ్డారు.. మరి వారి మంచి పనులకు వారికి ప్రతిఫలం ఎక్కడ లభిస్తుంది?

  ఇలా హేతుబద్ధంగా ఆలోచిస్తే మరణానతరం మరొక లోకం లేదా జీవితం ఉండడం ఎంతైనా అవసరమనేది బోధపడుతుంది. ఈ విధంగా మరణాంతర జీవిత భావన అనేది “సంపూర్ణ న్యాయం” అనే ఆవశ్యకత మీద ఆధారపడి ఉంది. న్యాయాధిపతి అయిన దేవుడు ఒకడున్నాడనే నమ్మకం ఉన్నవారికి మరణానంతర జీవితం మీద విశ్వాసం ఇంకా బలంగా ఉంటుంది.

  మరాణానంతర జీవితం గురించి ఇస్లాంలోని భావన

  ఈ భౌతిక ప్రపంచం ఒకానొక రోజున అంతమౌతుందని ఇస్లాం ధర్మంలో చాలా స్పష్టంగా ఉంది.. సర్వ మానవాళి అంటే మొట్ట మొదటి మానవుడైన ఆదాము నుంచి చిట్ట చివరి మానవుడి వరకు పునరుద్ధానం చెంది, తీర్పు దినమున కర్మల విచారణ ఎదుర్కుంటారని ఇస్లాం బోధిస్తుంది. నిజ దైవాన్ని విశ్వసించి, అతడి అజ్ఞాపాలన మరియు సత్కర్మలు చేసిన వారికి మంచి ప్రతిఫలం (స్వర్గం) మరియు దైవ ధిక్కరణకు పాల్పడిన వారికి శిక్ష (నరకం) ఉంటాయని ప్రకటిస్తుంది. ఇహలోక జీవితం తాత్కాలికమైనదనీ, పరలోక జీవితం శాశ్వతమైనదని కూడా పేర్కొనబడింది.

  స్వర్గ-నరక జీవితాలు శాశ్వతమైనవి కనుక దేవుడు హిట్లర్ ను, ఆత్మాహుతి దాడులు చేసిన వారిని కొన్ని లక్షల సార్లు లేదా అంత కంటే ఎక్కువగా కూడా శిక్షించగలడు. అలాగే దేవుడు అమాయకులకు, సద్వర్తనులకు నష్ట పరిహారంగా లేక ప్రతిఫలంగా తాను కోరినంత ఇచ్చి వారికి కూడా సంపూర్ణ న్యాయం చేయగలడు.

  మరణించిన తరువాత తిరిగి బ్రతికించడం సాధ్యమా?

  దేవుడు ఖురానులో ఇలా సెలవిస్తున్నాడు (అధ్యాయం 36, వాక్యం 79)

  ఇలా అను: మొదట వాటిని పుట్టించిన ఆయనే, మళ్ళీ వాటిని బ్రతికిస్తాడు. మరియు ఆయనకు, ప్రతి దానిని సృష్టించే జ్ఞానముంది.

  ఏదైనా పని మొదటిసారి చేయడం కష్టం, దానిని రెండవ సారి చేయడం ఎప్పుడూ సులభమే! దేవుడు మనల్ని మొదటి సారి ఎటువంటి ఇబ్బంది లేకుండా సృష్టించగలిగినప్పుడు, మనం మరణించిన తరువాత తిరిగి బ్రతికించడం దేవుడికి ఎందుకు కష్టతరమవుతుంది? అది ఆయనకు ఎంతో సులభం!

  ఇస్లాంలోని మరణానంతర జీవితంలో న్యాయం

  దేవుడు ఖురానులో ఇలా సెలవిస్తున్నాడు (అధ్యాయం 18, వాక్యం 49)

  మరియు కర్మపత్రం వారి ముందు ఉంచబడినపుడు, ఆ అపరాధులు, అందులో ఉన్న దానిని చూసి భయపడటాన్ని నీవు చూస్తావు. వారు ఇలా అంటారు: ‘అయ్యో! మా దౌర్భాగ్యం ఇదేమి గ్రంథం! ఏ చిన్న విషయాన్ని గానీ, ఏ పెద్ద విషయాన్ని గానీ ఇది లెక్కపెట్టకుండా విడువ లేదే!’ తాము చేసిందంతా వారు తమ ఎదుట పొందుతారు. నీ ప్రభువు ఎవ్వరికీ అన్యాయం చేయడు.

  గమనించండి: తాను చేసిన మంచి మరియు చెడు కార్యాల విచారణ నుండి ఏ ఒక్కరూ తప్పించుకోలేరు. ప్రతీ నేరస్థుడు తాను ఎందుకు శిక్షించబడుతున్నాడో తెలుసుకుంటాడు.

  దేవుడు ఖురానులో ఇలా సెలవిస్తున్నాడు (అధ్యాయం 3, వాక్యం 185)

  ప్రతి ప్రాణి చావును చవిచూస్తుంది. మరియు నిశ్చయంగా, తీర్పుదినమున మీ కర్మల ఫలితం మీకు పూర్తిగా ఇవ్వబడుతుంది. కావున ఎవడు నరకాగ్ని నుండి తప్పించబడి స్వర్గంలో ప్రవేశపెట్టబడతాడో! వాస్తవానికి, వాడే సఫలీకృతుడు. మరియు ఇహలోక జీవితం కేవలం మోసపుచ్చే సుఖానుభవం మాత్రమే!

  గమనించండి: బాధితులు నిరాశ, నిస్పృహ చెందవలసిన అవసరం లేదు. ఎందుకంటే వారికి తీర్పుదినమున పూర్తి నష్ట పరిహారం ఇవ్వబడనుంది.

  దేవుడు ఖురానులో ఇలా సెలవిస్తున్నాడు (అధ్యాయం 99, వాక్యాలు 7,8)

  అప్పుడు, ప్రతివాడు తాను, రవ్వంత (పరమాణువంత) మంచిని చేసి ఉన్నా, దానిని చూసుకుంటాడు. మరియు అలాగే, ప్రతివాడు తాను రవ్వంత (పరమాణువంత) చెడును చేసి ఉన్నా, దానిని చూసుకుంటాడు.

  దేవుడు ఖురానులో ఇలా సెలవిస్తున్నాడు (అధ్యాయం 3, వాక్యం 30)

  ఆ రోజు ప్రతి ప్రాణి తాను చేసిన మంచిని మరియు తాను చేసిన చెడును ప్రత్యక్షంగా చూసుకున్నప్పుడు, తనకు మరియు దానికి మధ్య దూరం ఉంటే, ఎంత బాగుండేదని ఆశిస్తుంది. మరియు దేవుడు (తనకే భీతిపరులై ఉండమని) మిమ్మల్ని స్వయంగా హెచ్చరిస్తున్నాడు. మరియు దేవుడు తన దాసుల ఎడల ఎంతో కనికరుడు.

  గమనించండి: తాను చేసిన మంచి మరియు చెడు కార్యాల విచారణ నుండి ఏ ఒక్కరూ తప్పించుకోలేరు. ప్రతీ నేరస్థుడు తాను ఎందుకు శిక్షించబడుతున్నాడో తెలుసుకుంటాడు.

  దేవుడు ఖురానులో ఇలా సెలవిస్తున్నాడు (అధ్యాయం 4, వాక్యం 40)

  నిశ్చయంగా, దేవుడు ఎవరికీ రవ్వంత (పరమాణువంత) అన్యాయం కూడా చేయడు. ఒక సత్కార్యముంటే ఆయన దానిని రెండింతలు చేస్తాడు; మరియు తన తరఫు నుండి గొప్ప ప్రతిఫలాన్ని కూడా ప్రసాదిస్తాడు.

  గమనించండి: ఎవరికీ అన్యాయం ఎంత మాత్రమూ జరుగదు, మంచి పనులకు రెట్టింపు ప్రతిఫలం ఉండనుంది. ఇది ప్రతీ వ్యక్తిలో సత్కార్యాలు ఆచరించే గుణాన్ని ప్రేరేపిస్తుంది.

  అంగవైకల్యంతో పుట్టే పిల్లలు మరియు తొందరగా చనిపోయే వారి గురించి

  ఈ ఇహలోక జీవితం సర్వ మానవాళికి ఒక పరీక్ష అని, కేవలం ఒక తాత్కాలికమైన అస్తిత్వమని ఖురాను బోధిస్తుంది. దేవుడు ఖురానులో ఇలా సెలవిస్తున్నాడు (అధ్యాయం 67, వాక్యం 2)

  ఆయనే! మీలో మంచిపనులు చేసే వారెవరో పరీక్షించటానికి, చావు-బ్రతుకులను సృష్టించాడు. మరియు ఆయన సర్వ శక్తిమంతుడు, క్షమాశీలుడు.

  ఇక్కడ ఒకొక్కరూ ఒకో రకంగా పరీక్షించబడుతున్నారు. కొందరు ధనంతో, కొందరు ఆరోగ్యంతో అయితే మరి కొందరు దీర్ఘ ఆయుష్షుతో పరీక్షించబడుతున్నారు..

  ఉదాహరణకు తీర్పు దినం రోజున, ఒక ధనవంతుడు తన ధనాన్ని ఎలా ఖర్చు పెట్టాడని ప్రశ్నించబడతాడు. అయితే ఒక బీద వాడు, బీదరికంలో మగ్గిన కారణం చేత అతడు ఈ ప్రశ్నలను, లెక్కలను ఎదుర్కొనడు.

  తీర్పు దినం రోజున, మనం మన కళ్ళను ఎలా ఉపయోగించామని ప్రశ్నించబడతాము, కళ్ళతో చేసిన అనేక పాపాల లెక్క ఎదుర్కోవలసి ఉంటుంది. అయితే, ఒక గుడ్డి వాడు ఈ ప్రశ్నలను, లెక్కలను ఎదుర్కొనడు.

  అలాగే తీర్పు దినం రోజున, మనం మన అవయవాలను ఎలా ఉపయోగించామని ప్రశ్నించబడతాము, తద్వారా చేసిన అనేక పాపాల లెక్క ఎదుర్కోవలసి ఉంటుంది. అయితే, అంగవైకల్యం ఉన్నవారు ఆ ప్రశ్నలను, లెక్కలను ఎదుర్కొనరు.

  ఆ రోజున ప్రతీ ఒక్కరికీ సంపూర్ణ న్యాయం చేయడం జరుగుతుంది.

  ఎవరికీ అన్యాయం జరుగదు

  దేవుడు ఖురానులో ఇలా సెలవిస్తున్నాడు (అధ్యాయం 4, వాక్యం 40)

  నిశ్చయంగా, దేవుడు ఎవరికీ రవ్వంత (పరమాణువంత) అన్యాయం కూడా చేయడు.

  WHAT OTHERS ARE READING

  Most Popular