అల్లాహు అక్బర్.. అల్లాహు అక్బర్
అల్లాహు అక్బర్… అల్లాహు అక్బర్
రోజుకు ఐదు సార్లు, మీకు సమీపంలోని మసీదు లౌడ్ స్పీకర్ల నుండి మీరు ఈ పిలుపును వినవచ్చు. ఇటీవల, అజాన్‌పై అనేక వివాదాలు తలెత్తుతున్నాయి. అజాన్ అంటే ఏమిటి మరియు దానిపై వివాదం ఎందుకు అనేది మనం తెలుసుకుందాము.
అజాన్ ఎందుకు?
ఇస్లాం మతం ప్రకారం ముస్లిములు రోజుకు 5 సార్లు తప్పనిసరిగా ప్రార్ధన చేయాలి. ఈ ప్రార్ధనలు మసీదులలో సామూహికంగా చేయబడతాయి. సూర్యుని గమనాన్ని బట్టి ప్రార్థన సమయాలు నిర్ణయించబడతాయి. ఉదాహరణకు సంవత్సరం పొడవునా సూర్యోదయం మరియు సూర్యాస్తమయం యొక్క సమయాలు మారుతూ ఉంటాయి. కాబట్టి, సూర్యోదయం మరియు సూర్యాస్తమయానికి ముందు ప్రార్థనల సమయాలు కూడా మారుతూ ఉంటాయి. ఈ విధంగా ఏడాది పొడవునా వేర్వేరు ప్రార్థన సమయాలు ఉండడం వలన, ముస్లింలు ప్రార్థన కోసం మసీదుకు చేరుకోవాలని నిర్ణీత సమయాల్లో వారికి గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. అందుకే “అజాన్ – ప్రార్థనకు పిలుపు” అనేది స్థాపించబడింది. ముస్లింలు ప్రార్థన పిలుపు వినగానే, మసీదుకు వెళ్లి అందరూ కలిసి ప్రార్థనలు చేస్తారు.
అజాన్ ఎలా ప్రారంభమైంది
ముహమ్మద్ ప్రవక్త కాలంలో, “అజాన్”కోసం అనేక ఆలోచనలు ఇవ్వబడ్డాయి. కొందరు గంట మోగించమని, మరికొందరు కొమ్ము ఊదాలని, మరికొందరు ఏదైనా మంటను రాజేసి దానిని ఒక సంకేతంలా వాడాలని సూచించారు. ప్రవక్త ముహమ్మద్, దేవుని ప్రేరణతో, ఈ ప్రార్ధనా పిలుపు కోసం మానవ స్వరాన్ని ఉపయోగించాలని నిర్ణయించారు. ప్రవక్త ముహమ్మద్ మానవ స్వరం కంటే ఎక్కువ బిగ్గరగా ఉండే గంట లేదా కొమ్మును గానీ లేదా ఎంతో దూరం నుండి కనబడే అగ్ని గుండాన్ని గానీ అజాన్ కోసం ఎంచుకోకపోవడం గమనించదగిన విషయం. మానవ స్వరంలో ఇవ్వబడిన పిలుపు దానిని ఇచ్చేవారికి మరియు వినేవారికి ఒక ఆధ్యాత్మిక అనుభవాన్ని కలిగిస్తుంది.
అజాన్‌లోని పదాల అర్థం
అల్లాహు అక్బర్ = దేవుడు అందరికంటే గొప్పవాడు
అష్ హదు అన్ లా ఇలాహ ఇల్లా అల్లాహ్ = ఆరాధనకు అర్హమైన శక్తి దేవుడు తప్ప మరొకటి లేదని నేను సాక్ష్యమిస్తున్నాను.
అష్ హదు అన్న ముహమ్మదుర్ రసూల్ అల్లాహ్ = ముహమ్మద్ దేవుని సందేశహరుడు (ప్రవక్త) అని నేను సాక్ష్యమిస్తున్నాను
హయ్యా అల్-సలాహ్ = ప్రార్థన వైపుకు రండిహయ్యా అల్-ఫలాహ్ = సాఫల్యం వైపుకు రండి.
గమనిక: అల్లా ముస్లింల వ్యక్తిగత దేవుడు కాదు. దేవుడు అనే తెలుగు పదానికి అరబీ భాషలో సమాన పదం అల్లాహ్. అరబ్ క్రైస్తవులు మరియు యూదులందరూ దేవుడు అనడానికి “అల్లా” అనే పదాన్ని ఉపయోగిస్తారు. “గాడ్” అనే ఆంగ్ల పదాన్ని అరబిక్‌లోకి అనువదించడానికి గూగుల్ అనువాదాన్ని ఉపయోగించండి. అది “అల్లా” అని ఉంటుంది.

అజాన్ ఒక ఆధ్యాత్మిక అనుభవం
అజాన్‌లోని పదాల అనువాదాన్ని చదివితే, అందులో అభ్యంతరకరమైనది ఏమీ లేదని ఎవరైనా అంగీకరిస్తారు. అజాన్‌లోని పదాల వెనుక ఉన్న ఆధ్యాత్మిక అర్థాన్ని ఇప్పుడు చూద్దాం.
అల్లాహు అక్బర్ – దేవుడు అందరికంటే గొప్పవాడు
దేవుడిని విశ్వసించే ప్రతి వ్యక్తి దేవుడే అందరికంటే గొప్పవాడని అంగీకరిస్తారు.
అష్ హదు అన్ లా ఇలాహ ఇల్లా అల్లాహ్ – ఆరాధనకు అర్హమైన శక్తి దేవుడు తప్ప మరొకటి లేదని నేను సాక్ష్యమిస్తున్నాను.
దేవుడే అందరికంటే గొప్పవాడు కాబట్టి, దేవుడిని మాత్రమే పూజించాలి తప్ప మరెవరినీ లేదా దేనినీ కాదు, మరియు దేవుడి ఆజ్ఞాపాలన చేయాలి. ఇది చాలా హేతుబద్ధమైన విషయం మరియు అందరికీ ఆమోదయోగ్యమైనది.
అష్ హదు అన్న ముహమ్మదుర్ రసూల్ అల్లాహ్ = ముహమ్మద్ దేవుని సందేశహరుడు (ప్రవక్త) అని నేను సాక్ష్యమిస్తున్నాను
దేవుడి ఆరాధన మరియు విధేయత గురించి బోధించిన చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్. కాబట్టి, ప్రార్థనకు పిలుపులో ముస్లిములకు ఆయన గురించి, ఆయన స్థానం గురించి గుర్తు చేయడం జరుగుతుంది (ఆయన ఒక ప్రవక్త, ఆరాధనా యోగ్యుడు కాదు అని). దేవుని ప్రవక్తలు ఎవరు అని మీరు ఆలోచిస్తున్నట్లయితే, వారి గురించి మీరు ఇక్కడ చదవవచ్చు.
హయ్యా అల్-సలాహ్ – ప్రార్థన వైపుకు రండి
మానవులు, దేవుడికి ఎంత విధేయత చూపాలని మరియు పూజించాలని కోరుకున్నా కూడా వారు పరధ్యానంలో పడిపోయి, పాపాలు మరియు అనైతికతలకు నిలయమైన ప్రాపంచిక సుఖాలలో మునిగిపోతారు. మానవులు ఈ పాపాలు మరియు అనైతికతల నుండి తమను తాము శుద్ధి చేసుకోవడానికి ప్రతీ రోజూ క్రమమైన సమయాలలో తమ సృష్టికర్త, సర్వశక్తిమంతుడైన దేవుడిని (ప్రార్ధన ద్వారా) కలవడం చాలా ముఖ్యం.
ప్రవక్త ముహమ్మద్ ఇలా అన్నారు :
“మీ ఇంటి వాకిట్లో నది ఉండి, మీరు రోజుకు ఐదుసార్లు అందులో స్నానం చేస్తే, మీపై ఏదైనా మురికిని మీరు గమనిస్తారా?” ఆయన చుట్టూ ఉన్న వారు ఇలా అన్నారు: “మురికి యొక్క జాడ కూడా మిగిలి ఉండదు.” ప్రవక్త ఇలా అన్నారు, “అది దేవుడు మానవులను పాపాల నుండి శుద్ధి చేసే ఐదు ప్రార్థనల ఉదాహరణ.” (ప్రస్తావన: సహిహ్ బుఖారీ).
హయ్యా అల్-ఫలాహ్ – సాఫల్యం వైపుకు రండి
ఈ జీవితం తాత్కాలికమైనది మరియు మరణానంతర జీవితం శాశ్వతమైనది మరియు అంతులేనిది అని ఇస్లాం బోధిస్తుంది. మంచి పనులు చేసి ధర్మబద్ధంగా జీవించేవారు మరణానంతర జీవితంలో విజయం సాధిస్తారు, చెడు పనులు చేసేవారు మరణానంతర జీవితంలో ఓడిపోతారు. మీరు మరణానంతర జీవితం గురించి తెలుసుకోవాలంటే ఇక్కడ చదవగలరు. రోజువారీ ప్రార్థనలు సృష్టికర్తతో కనెక్ట్ అవ్వడానికి మరియు పాపాలు మరియు అనైతికతల నుండి శుద్ధి కావడానికి శక్తివంతమైన మార్గం కాబట్టి, ఈ ప్రార్థనలను అవగాహన మరియు చిత్తశుద్ధితో చేసే వ్యక్తి మంచి పనులు చేయడానికి మాత్రమే ప్రయత్నిస్తాడు మరియు చెడు పనులకు దూరంగా ఉంటాడు. కాబట్టి, రోజువారీ ప్రార్థనలు మరణానంతర జీవితంలో సాఫల్యానికి కీలకం. అందుకే అజాన్ లో “సాఫల్యం వైపుకు రండి” అని అనబడింది.
ముస్లిమేతరులు మరియు అజాన్
ఆజాన్ విని ఆధ్యాత్మిక తన్మయత్వానికి గురి అయిన BBC రిపోర్టర్
లియామ్ నీసన్ అజాన్ వినడానికి ఇష్టపడ్డాడు
మోర్గాన్ ఫ్రీమాన్ అజాన్ ప్రపంచంలోని అత్యంత మధురమైన శబ్దాలలో ఒకటి అన్నాడు
అజాన్ – ప్రతి మనిషి నీతిమంతుడిగా మరియు మంచిగా ఉండాలని గుర్తు చేస్తుంది
ప్రపంచంలో అనైతికత, అసభ్యత మరియు నేరాలు పెరుగుతున్నాయని మనలో చాలా మంది అంగీకరిస్తారు. వ్యక్తిగత స్వార్ధం మరియు అనైతికతల సమాజంలో మనం మనం బ్రతుకుతున్నాం. ముసలి తల్లిదండ్రులను సైతం వారి పిల్లలు వదిలివేయడం మరియు వృద్ధాశ్రమాల సంఖ్య పెరగడం మనం చూస్తున్నాం. ఇటువంటి తరుణంలో, దేవునితో సంబంధాన్ని పటిష్ట పరుస్తూ, మంచి పనులను ప్రోత్సహించే ఒక నిరంతర ఆధ్యాత్మిక పిలుపు అనేది అత్యావశ్యకం మరియు అది స్వాగతించబడాలి.
అజాన్ మరియు లౌడ్ స్పీకర్లు
దేవాలయాలు, చర్చిలు మరియు మసీదుల వంటి ప్రార్థనా స్థలాలలో లౌడ్ స్పీకర్లను ఉపయోగించడం కొత్త విషయం కాదు. అన్ని ప్రార్థనా స్థలాలలో ఎప్పటినుండో లౌడ్ స్పీకర్లను ఎటువంటి సమస్యలు లేకుండా ఉపయోగిస్తున్నారు. భారతదేశం ఒక ఆధ్యాత్మిక దేశం మరియు గొప్ప ఆధ్యాత్మిక సంప్రదాయాన్ని కలిగి ఉంది. ప్రపంచంలో ఆధ్యాత్మికతను గౌరవించే దేశం ఏదైనా ఉందంటే అది భారతదేశమే. ఆధ్యాత్మిక జీవులుగా, ఆధ్యాత్మికతకు సంబంధించిన అంశాలతో ఎవరికైనా సమస్యలు ఎలా ఉంటాయి?
అదే సమయంలో, ముస్లిములు మరియు ఇతర మతాల వారు కూడా ప్రజలు విశ్రాంతి తీసుకొనే సమయాల్లో లౌడ్ స్పీకర్లను ఉపయోగించడం వల్ల శిశువులు, అనారోగ్యంతో ఉన్నవారు మరియు వృద్ధులకు ఇబ్బంది కలుగుతుందని గుర్తించాలి. కాబట్టి వారు ఇతరులకు అసౌకర్యం కలిగించే రీతిలో లౌడ్ స్పీకర్ల వాడకాన్ని నివారించడం శ్రేయస్కరం.
ఈ విషయంలో ఇస్లాం యొక్క మార్గదర్శకత్వం చాలా స్పష్టంగా ఉంది. ప్రవక్త ముహమ్మద్ ఇలా అన్నారు
ముస్లిం అంటే ఎవరి నాలుక మరియు చేతుల నుండి ప్రజలు సురక్షితంగా ఉంటారోఅతడు, మరియు ఏ వ్యక్తి నుండి ప్రజల జీవితాలు మరియు సంపదసురక్షితంగా ఉంటాయో అతడే నిజమైన దైవ విశ్వాసి.
మూలం: సునన్నసాయి
నిజమైన ముస్లిం తన చర్యల వల్ల ఎవరికీ ఇబ్బంది కలిగించడు. కాబట్టి ముస్లింలు లౌడ్ స్పీకర్ల డెసిబెల్ స్థాయి గౌరవనీయమైన కోర్టుల మార్గదర్శకాల ప్రకారం ఉండేలా చూసుకోవాలి. ఇతర మతాల ప్రజలు కూడా లౌడ్ స్పీకర్లను ఉపయోగించినప్పుడు గౌరవనీయమైన కోర్టుల మార్గదర్శకాలను అనుసరిస్తారని మేము ఆశిస్తున్నాము.