More

    Choose Your Language

    నా జీవిత పరమార్థం ఏమిటి?

    మనం ఎందుకు ఉన్నాము? మనం తయారుచేసే ప్రతీ వస్తువుకు, మన శరీరంలోని ప్రతీ అవయవానికి మరియు ప్రకృతిలోని ప్రతీ అంశానికి ఒక ఉద్దేశ్యం, లక్ష్యము ఉన్నప్పుడు మానవ జాతికి ఎటువంటి లక్ష్యము లేదనడం హేతుబద్ధమా?

    పరిచయం

    ఈ రోజు మీరు బ్రతికి ఉన్నారు, ఒకానొక రోజు మీరు మరణిస్తారు. ఇది సత్యం. ఈ భూమిపై నేను ఎందుకు ఉన్నాను? అని ఎప్పుడైనా ఆలోచించారా? ముందుగా, మీ చుట్టూ చూడండి.. మన చేతులతో చేసిన అనేక వస్తువుల మధ్య మనం ఉన్నాము. ఆ వస్తువులను మనం ఎందుకు చేసాము? వాటికి ఏదైనా ప్రయోజనం, ఉద్దేశ్యం, లక్ష్యం అనేవి ఉన్నాయా? అని ప్రశ్నించుకుంటే “అవును” అనే సమాధానం వస్తుంది. ఇప్పుడు, మన శరీరంలోని అవయవాల గురించి ఒక సారి ఆలోచిద్దాము. అందులో నిరుపయోగకరమైన అవయవం ఏదైనా ఉందా? మన చుట్టూ ఉన్న ప్రాకృతిక అంశాలైన చెట్లు, పర్వతాలు మొదలైనవాటి గురించి కూడా ఆలోచిద్దాము. వాటిలో కూడా ప్రతీదీ ఏదో ఒక ప్రయోజనం లేకుండా ఊరికే లేదు. మనం తయారుచేసే ప్రతీ వస్తువుకు, మన శరీరంలోని ప్రతీ అవయవానికి మరియు ప్రకృతిలోని ప్రతీ అంశానికి ఒక ఉద్దేశ్యం, లక్ష్యము ఉన్నప్పుడు మానవ జాతికి ఎటువంటి లక్ష్యము లేదనడం హేతుబద్ధమా?

    సరే, మనం ఎందుకు ఉన్నాము? పేరు ప్రఖ్యాతులు, ఆస్తిపాస్తులు సంపాదించడానికా? జీవితాన్ని అనుభవించడానికా? కాదు, ఈ జీవితానికి ఒక మహోన్నత ఉద్దేశ్యం ఒకటి ఉండి ఉండాలి, అదేమిటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం..

    ఎవరు మన జీవితానికి ఒక లక్ష్యాన్ని నిర్దేశించాలి?

    మీరు ఇలా అనవచ్చు – “నేనే నా జీవితానికి ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకుంటాను”
    ఒక పెన్ను ఉదాహరణ తీసుకుందాం. పెన్ను తయారుచేయడం వెనుక ఉద్దేశ్యం ఏమిటి? ఖచ్చితంగా చెప్పాలంటే వ్రాయడానికి. అయితే ఎవరు ఆ ఉద్దేశ్యాన్ని నిర్ణయించారు? పెన్నుని వాడుతున్న వారా లేక దానిని తయారుచేసిన వాడా? ఎవరైతే ముందు దానిని తయారుచేశాడో అతనే కదా? పెన్నుని మనం అనేక ఇతర పనుల కోసం కూడా ఉపయోగించవచ్చు. ఉదాహరణకు మనం దానిని వీపును గోక్కోడానికి కూడా వాడవచ్చు కానీ అది దాని ఉద్దేశ్యం లేదా లక్ష్యం అని మనం వాదించలేము. దానిని కనుగొన్న వాడు లేదా తయారు చేసిన వాడే దాని అసలు ఉద్దేశ్యాన్ని, లక్ష్యాన్ని నిర్ణయించేది.

    అలాగే, మనం ఈ ప్రపంచంలో ఉండడానికి గల కారణాలు అనేకం మనం చెప్పవచ్చు కానీ అది మన అస్తిత్వానికి గల అసలు కారణం లేదా పరమార్థం అయితే కానేరదు. మన అస్తిత్వానికి గల అసలు కారణాన్ని మనం మన సృష్టికర్త నుండి మాత్రమే తెలుసుకోగలం.

    మీకొక సృష్టికర్త ఉన్నాడా?

    మీరొక బ్రిడ్జినో, ఒక పరికరాన్నో, ఒక వాహనాన్నో చూసినపుడు దానిని తయారు చేసిన వాడు ఒకడు ఉన్నాడని నమ్ముతారు. మరి ఈ విశ్వం గురించి మీ అభిప్రాయం ఏమిటి? విశ్వంలో మనకు క్రమబద్ధత, నిర్దిష్టమైన పొందిక, సమతాళము, సృజనాత్మకత అణువణువునా దర్శనమిస్తాయి. ఉదాహరణకు సూర్యోదయ, సూర్యాస్తమయ, సూర్య, చంద్ర గ్రహణాల సమయాలను కొన్ని వందల సంవత్సరాల వరకు మనం ఖచ్చితంగా లెక్కలు వేసి చెప్పగలం. విశ్వంలోని గ్రహాలు, నక్షత్రాల మధ్య సమతాళము, సమతౌల్యము, పొందికలు ఉండడం వలననే ఇది సాధ్యం అవుతుంది. విశ్వ నిర్మాణ క్రమంలో సృజనాత్మకత (design) ఉందనడానికి ఇదే తిరుగులేని ఆధారం. ఒక గోడమీద రంగులు యథేచ్ఛగా విసురుతూ పోతే కొన్ని ఆకారాలు (ఉదాహరణకు చెయ్యి లేదా ఒక పక్షి లాంటి ఆకారాలు) కనిపించవచ్చు కాని, మోనా లిసా లాంటి ఒక అందమైన చిత్రపటం దానికదే తయారు అవుతుందా? విశ్వంలోని కూర్పు మోనా లిసా కంటే కూడా సంక్లిష్టమైనది. ఇటువంటిది విశ్వం ఒక సృష్టికర్త లేకుండా దానికదే ఉనికిలోకి వచ్చింది అని నమ్మడం ఎంత అహేతుకమైన, అసంబద్ధమైన విషయం? విస్ఫోటనాలు విధ్వంసమే కలిగిస్తాయని మనందరికీ తెలుసు. ఇంతటి కూర్పుతో ఉన్న ఈ విశ్వం కేవలం యాదృచ్చికంగా లేక బిగ్ బ్యాంగ్ అనబడే ఒక భారీ విస్ఫోటనం ద్వారా ఉనికిలోకి వచ్చిందని మీకు అనిపిస్తుందా? ఒక చెత్త కుప్పలో విస్ఫోటనం జరిగి అందులోనుండి ఒక బెంజు కారు లేదా రోల్స్ రాయస్ కారు తయారయ్యి వచ్చాయంటే మీరు నమ్ముతారా?

    దేవుడు విశ్వాన్ని సృష్టిస్తే మరి దేవుడిని ఎవరు సృష్టించారు?

    మనం ప్రతీ వస్తువు యొక్క ఆది, అంతాలను లెక్కించడానికి సమయాన్ని ఉపయోగిస్తాం. ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే – విశ్వం వలే, “సమయం” అనేది కూడా అస్తిత్వంలోకి వచ్చింది. విశ్వంలోని ప్రతీ వస్తువు ఈ సమయం మీద ఆధారపడి ఉంది అందుకని దానికి ఆద్యంతాలు ఉన్నాయి. ఈ విశ్వాన్ని సృష్టించిన సృష్టికర్త “సమయం” అనేది ఉనికిలోకి రాక ముందే ఉన్నాడు కాబట్టి అతడు సమయాధీనంలో లేడు. అందుకని సృష్టికర్తకు ఆది, అంతాలు ఉండజాలవు. అతడు ఎల్లప్పుడూ ఉండేవాడు లేదా శాశ్వతమైన వాడు. శాశ్వతమైన వాడికి మరొక సృష్టికర్త అవసరం ఉండదు.

    దేవుడు మినల్ని సృష్టించి, మార్గదర్శకత్వం చేయకుండా వదిలివేశాడా?

    దేవుడు మనుషులను సృష్టించి వదిలివేయలేదు, వారికి మార్గదర్శకత్వం చేసే ఏర్పాటు కూడా చేసాడు. ఒక కారు పని తీరును చూపించాలంటే అది మరొక కారుతోనే చేయాలి గాని బైక్ తో కాదు. అలాగే మనుషులు మంచిగా జీవించడానికి దేవుడు ధర్మ పారాయణులైన సత్పురుషులను వారికి ఆదర్శంగా నిలవడానికి మరియు హితబోధ చేయడానికి పంపించాడు. ఈ ఆదర్శ పురుషులే దైవ ప్రవక్తలు.

    ప్రవక్తలు – మానవాళికి ఆదర్శ మూర్తులు

    ప్రవక్తలు మానవులకు ఆదర్శంగా నిలిచి, నివసించి చూపించారు. ప్రవక్తలు కేవలం మానవ మాత్రులే, దేవుని గుణగణాలు కలవారు కాదు. దేవుడు ప్రవక్తలను మన దేశంతో సహా ప్రతీ దేశానికి పంపించాడు. కొంత మంది ప్రవక్తలు – నోహ్, అబ్రహం, డేవిడ్, సాలమన్, మోసెస్ మరియు జీసస్.

    సుదీర్ఘమైన ఈ ప్రవక్తల పరంపరలోని చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్. అంతకు ముందు వచ్చిన ప్రవక్తలు ఒక ప్రాంతపు జాతి వారి కోసమో, ఒక పరిమిత సమయం కోసమో వచ్చారు. అయితే ముహమ్మద్ ప్రవక్త సకల మానవాళి కోసం పంపబడ్డారు – మీ కోసం, నా కోసం, మనందరి కోసం మరియు ఈ ప్రపంచం అంతం అయ్యే రోజు వరకు ఆయనే మనందరి ప్రవక్త.

    ప్రవక్తల బోధనలు

    దేవుని ప్రవక్తలందరూ ముఖ్యంగా 3 విషయాలను బోధించారు. అవి:

    1. మన అస్తిత్వానికి గల పరమార్థం లేదా లక్ష్యం

    2. దేవుని గుణగణాలు

    3. మరణానంతర జీవితంలో దేవుడి ముందు మన కర్మలకు జవాబుదారీతనం

    మన అస్తిత్వం యొక్క పరమార్థం లేదా లక్ష్యం

    మన జీవిత పరమార్థం మన సృష్టికర్తను సేవించడం (ఆరాధించడం, ఆజ్ఞా పాలన చేయడం) మాత్రమే తప్ప వేరే ఏదీ కూడా కాదు. సృష్టికర్తనే ఆరాధించాలి, సృష్టితాలను కాదు. చెట్లు, చేమలు, నదులు, సూర్య చంద్రులు, గ్రహాలు, నక్షత్రాలు, జంతువులు, విగ్రహాలు, పుణ్యపురుషులు, బాబాలు, దైవ ప్రవక్తలు, పౌరాణిక గాథలలోని పాత్రలు మొదలైనవన్నీ సృష్టితాలే. దేవుడి అస్తిత్వాన్ని నిరాకరించకూడదు, ఎవరినీ లేదా దేనిని కూడా దేవుడి అస్తిత్వానికి సమానంగా చేయకూడదు.

    దేవుని గుణగణాలు

    1. దేవుడు ఒక్కడే మరియు దేవుడికి సమానమైనది ఏదీ లేదు.

    2. దేవుడు తిండి, నిద్ర, కుటుంబం మొదలైన అవసరాలు లేనివాడు అందుకని దేవుడు తినడు, నిద్రపోడు, తల్లిదండ్రులను, భార్యా పిల్లలను కలిగి ఉండడు.

    3. సృష్టిలా కాకుండా దేవుడు సర్వ శక్తిమంతుడు కావడం వలన దేవుడికి సృష్టిరాసుల బలహీనతలు (అలసట రావడం, కునుకు రావడం, మతిమరుపు రావడం, తప్పులు చేయడం వంటివి) ఉండవు.

    4. దేవుడు మనుషుల మధ్య పుట్టుక, జాతి, కులం, వంశం మొదలైన వాటి ఆధారంగా బేధ భావం కలిగి ఉండడు. ఆయన ముందు మానవులంతా సమానమే, ఆయన అందరినీ సమానంగా ప్రేమిస్తాడు.

    మరణానంతర జీవితం

    ఒకానొక రోజు ఈ ప్రపంచం అంతం అవుతుంది. ఆ తరువాత వచ్చే తీర్పుదినం నాడు మానవులందరూ (మొట్ట మొదటి వ్యక్తి నుండి చిట్ట చివరి వ్యక్తి వరకు) తిరిగి బ్రతికించబడి తమ సృష్టికర్త ముందు హాజరయి తమ కర్మలకు జవాబు చెప్పుకోవలసి ఉంటుంది. కేవలం నిజ దైవాన్ని ఆరాధించి, మంచి పనులు చేసిన వారికి మంచి ప్రతిఫలం ఇవ్వబడుతుంది. దేవుణ్ణి ధిక్కరించి, పాపాలు చేసిన వారు శిక్షించబడతారు. ఆ మంచి ప్రతిఫలం స్వర్గం, శిక్ష నరకం. స్వర్గ నరక జీవితాలు అనంతమైనవి, ఎప్పటికీ అంతం కావు.

    మరణానంతర జీవితం మనకు అవసరమా?

    మనందరికీ న్యాయం కావాలి. కానీ ఈ లోకం అన్యాయంతో నిండి ఉంది. ఇక్కడ చెడ్డవారు ఆనందిస్తున్నారు, మంచి వారు కష్టాలు అనుభవిస్తున్నారు. మరొక అన్యాయం ఏమిటంటే ఎంతో మందిని చంపిన ఒక హంతకుణ్ణి మనం సంపూర్ణంగా శిక్షించలేము ఎందుకంటే వాడికి మరణ శిక్ష విధించినా అది ఒక హత్యకు సరిపడే శిక్షే తప్ప అతడు చేసిన మారణ కాండకు సరి తూగదు. అతడు చేసిన మిగతా హత్యల సంగతి ఏమిటి? అంతేకాదు, అనేక మంది మంచి వారు ఇక్కడ చిత్రహింసలు అనుభవించడం, మరణించడం కూడా మనం చూస్తున్నాము. ఆ మంచి వారు, వారి మంచి పనులకు ప్రతిఫలం పొందాలి కదా? దీనిని బట్టి మనకు అర్ధం అయ్యేది ఏమిటంటే ఈ ప్రపంచంలో సంపూర్ణ న్యాయం జరగడం అనేది సాధ్యం కాదు. సర్వ శక్తిమంతుడు అయిన దేవుడు న్యాయాధిపతి, ఆయన సంపూర్ణ న్యాయం చేసి తీరుతాడు. అది మరణానంతర జీవితంలో తప్పక జరుగుతుందని ఆయన మనకు వాగ్దానం చేస్తున్నాడు.

    మరణానంతర జీవితం సంభవమా?

    ఏదైనా పని మొదటిసారి చేయడం కష్టం, దానిని రెండవ సారి చేయడం ఎప్పుడూ సులభమే! దేవుడు మనల్ని మొదటి సారి ఎటువంటి ఇబ్బంది లేకుండా సృష్టించగలిగినప్పుడు, మనం మరణించిన తరువాత తిరిగి బ్రతికించడం దేవుడికి ఎందుకు కష్టతరమవుతుంది? అది ఆయనకు ఎంతో సులభం!

    దేవుడు క్షమించని తప్పు ఏమిటి?

    దేవుడు ఎటువంటి వారిని క్షమించడు అంటే, సత్యం తెలిసిన తరువాత కూడా ఎవరైతే:

    1. ఆరాధన మరియు ఆజ్ఞా పాలనలో దేవుడితో పాటు ఇతరులను (సృష్టిలోని అంశాలయినటువంటి గాలి, నీరు, అగ్ని, గ్రహాలు, దేవతలు మొదలైనవి లేదా మానవులు తమ స్వహస్తాలతో తయారు చేసిన శిల్పాలు, విగ్రహాలు, చిత్రపటాలు, పుణ్య పురుషుల సమాధులు లేదా బాబాలను) భాగస్వాములుగా చేస్తారో

    2. దేవుడి కొడుకు అని, భార్య అని, సంతతి అని లేదా వారిలో దేవుడి లక్షణాలు ఉన్నాయని చెప్పి మానవులను దేవుడిగా కొలుస్తారో

    3. దేవుడి అస్తిత్వాన్ని, లక్షణాలను నిరాకరిస్తారో

    దేవుడిని వదలి ఇతరులను ఆరాధించడం అతి పెద్ద కృతఘ్నత (విశ్వాస ద్రోహం)

    మీరు ఏ మతాన్ని అనుసరించేవారైనా, దేవుడు మిమ్మల్ని పోషిస్తున్నాడు. ఒక ఉదాహరణను తీసుకుందాము. మూత్ర విసర్జన తరువాత మీరు దేవుడికి కృతజ్ఞతలు ఎప్పుడైనా చెల్లించారా? ఇందులో దేవుడికి కృతజ్ఞత తెలుపవలసిన విషయం ఏముందని మీకు అనిపించవచ్చు. ఒక డయాలసిస్ రోగిని దీనిని గురించి అడగండి, అప్పుడు మీకు మేము చెప్పదలచుకున్న విషయం ఏమిటో అర్ధం అవుతుంది. జీవితంలో మనం దేవుడి యొక్క అనేక కారుణ్యాలను అనుభవిస్తున్నాము, ఆస్వాదిస్తున్నాము. కానీ, మనలాంటి మనుషులు సృష్టించిన వస్తువులను ఆరాధిస్తూ మనం మన సృష్టికర్తకు ఎంతటి విశ్వాస ద్రోహాన్ని తలపెడుతున్నామో ఒక్కసారి ఆలోచించండి! మనకున్నంత విచక్షణా జ్ఞానం లేని కుక్క కూడా తన యజమానిని గుర్తించి విశ్వాసంతో ఉంటుంది., మరి మన పరిస్థితి ఏమిటి?

    ఇస్లాం అంటే ఏమిటి?

    ముహమ్మద్ ప్రవక్త ‘ఇస్లాం’ అనే ఒక కొత్త మతాన్ని స్థాపించలేదు. ఇస్లాం అనే అరబిక్ పదానికి అర్ధం దేవుడి విధేయత, దాస్యం మరియు ఆజ్ఞా పాలన (శరణాగతి). గతించిన ప్రవక్తలందరి బోధన కూడా ఇదే. వారందరూ బోధించిన ధర్మాన్నే ముహమ్మద్ ప్రవక్త పునరుద్ధరించారు.

    ముస్లిం అంటే ఎవరు?

    దేవుడి ఆజ్ఞా పాలన చేస్తూ, దేవుడిని మాత్రమే ఆరాధించే ప్రతీ వ్యక్తిని అరబీలో ముస్లిం అంటారు. మీరు దేవుడి ఆజ్ఞా పాలన చేస్తూ, దేవుడిని మాత్రమే ఆరాధిస్తుంటే మిమ్మల్ని కూడా అరబీలో ముస్లిం అనే అంటారు.

    అల్లాహ్ అంటే ఎవరు?

    అల్లాహ్ కేవలం ముస్లిముల వ్యక్తిగత దేవుడు కాడు! ‘దేవుడు’ అనే తెలుగు పదానికి అరబీ భాషలో సమాన పదం ‘అల్లాహ్’. ఉదాహరణకు నీటిని ఇంగ్లీషులో ‘వాటర్’ అంటారు, హిందీలో ‘పాని’ అంటారు, కన్నడలో ‘నీరు’ అంటారు, అరబీలో ‘మోయా’ అంటారు. అలాగే దేవుడిని హిందీలో ‘ఈశ్వర్’, కన్నడంలో ‘దేవరు’, ఆంగ్ల భాషలో ‘గాడ్’, అరబీలో ‘అల్లాహ్’ అంటారు.

    ఖుర్ఆన్ అంటే ఏమిటి?

    ఖుర్ఆన్ అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ గారి ద్వారా మన కోసం అందజేయబడిన అంతిమ దైవవాణి (మానవాళికి నిబంధన పుస్తకం). ముహమ్మద్ ప్రవక్త దీనిని రచించలేదు. ఖుర్ఆన్ మొత్తం దైవ వాణే, 14 శతాబ్దాలుగా ఎటువంటి మార్పులు చెందలేదు. సుఖ సంతోషాలతో కూడిన ఒక శాంతియుత జీవితాన్ని గడిపేందుకు కావలసిన వివేకంతో కూడిన ఉపదేశాలు ఇందులో ఉన్నాయి.

    ఖుర్ఆన్ దైవ గ్రంధం అనడానికి ఆధారం

    తనలో ఒక తప్పునైనా చూపించండి అని ఖుర్ఆన్ సవాలు చేస్తుంది. ఈ గ్రంధ కర్త అయిన దేవుడు ఇలా అంటున్నాడు:

    ఏమీ? వారు ఖుర్ఆన్ ను గురించి ఆలోచించరా? ఒకవేళ ఇది అల్లాహ్ తరపు నుండి గాక ఇతరుల తరపు నుండి వచ్చి ఉంటే, అందులో ఎన్నో పరస్పర విరుద్ధమైన విషయాలను చూసేవారు కదా!

    ఖుర్ఆన్ 4:82

    అనేక శాస్త్రాల ప్రస్తావన ఖుర్ఆన్ లో మనం చూడవచ్చు. భూగర్భ శాస్త్రం, సముద్ర విజ్ఞాన శాస్త్రం, పిండ శాస్త్రం, ఖగోళ శాస్త్రం, న్యాయ శాస్త్రం, మనస్తత్వ శాస్త్రం, ఔషధ శాస్త్రం, భౌతిక శాస్త్రం, జంతు శాస్త్రం మొదలైనవి. 14 వందల సంవత్సరాల క్రితం ఇటువంటి సమాచారం ఒక మానవ మాత్రుడు, నిరక్షరాస్యుడైన ముహమ్మద్ ప్రవక్త వారికి తెలవడం అసాధ్యం.

    WHAT OTHERS ARE READING

    Most Popular