ఇస్లాం అనేది ఒక అరబ్బుల మతమనే అపోహ చాలా మందికి ఉంది. ప్రవక్త ముహమ్మద్ అరేబియాలో పుట్టారనేది నిజం, కానీ దాని వలన ఇస్లాం ఒక అరేబియా సిద్ధాంతం కాజాలదు. అది ఎలాగనేది పరిశీలిద్దాము..
హిందూమతం భారతీయ సిద్ధాంతమా?
వేదోపనిషత్తులు మరియు ఇతర హిందూ తాత్విక విచారణలు మన దేశంలో ఉద్భవించినవని మనందరికీ తెలుసు. మరి అలాంటప్పుడు హిందూ భావజాలాన్ని భారత దేశానికి చెందిన సిద్ధాంతాలుగా పరిగణించి వాటిని మన దేశానికి పరిమితం చేయగలమా? స్వామి వివేకానంద, స్వామి ప్రభుపాద తదితరులు హిందూ భావజాలాన్ని మన దేశం వెలుపల విదేశాలలో కూడా ప్రచారం చేశారు. దీనిని బట్టి వారు దానిని మన దేశానికి పరిమితమైన సిద్ధాంతంగా చూడలేదనేది అర్ధం అవుతుంది. హిందూ భావజాలం భారత దేశానికి పరిమితం కానప్పుడు, ఇస్లాం కూడాఅరబ్ దేశాలకు పరిమితం చెందినది కానవసరం లేదుగా?

బౌద్ధమతం గురించి
బుద్ధుడు, బౌద్ధమతం మన దేశంలో పుట్టారు, కానీ ప్రపంచంలో అత్యధిక మంది బౌద్దులు ఉన్న దేశం చైనా. అంతేకాక కంబోడియా, థాయ్ల్యాండ్, శ్రీలంక, భూటాన్, బర్మా, సౌత్ కొరియా, జపాన్ మరియు సింగపూర్ తదితర దేశాలలో అత్యధిక మంది బౌద్దులు ఉన్నారు. వారు బౌద్ధ మతాన్ని ఒక భారతీయ లేదా అన్య మతంగా భావించి ఉంటే బౌద్ధ మతం ఇంతలా విస్తరించి ఉండేదా?
సామ్యవాదం గురించి
సామ్యవాదం లేదా కమ్యూనిజం అనేది రష్యాకు చెందిన కార్ల్ మార్క్స్ ద్వారా ప్రతిపాదించబడింది. అయితే సామ్యవాదాన్ని రష్యా సిద్ధాంతంగా ఎవరైనా పరిగణిస్తారా?
ప్రపంచ దేశాలలో ముస్లిముల జనాభా
ప్రపంచ ముస్లిం జనాభాలో కేవలం 20% మంది మాత్రమే అరబ్ దేశాలలో ఉన్నారని మీకు తెలుసా? 80% మంది అరబ్బేతరులు. ఇది మీరు గుర్తిస్తే చాలు, విషయం మీకు అర్ధం అవుతుంది.

గమనిక – ఇస్లాం అనేది ప్రవక్త ముహమ్మద్ వారు ప్రారంభించినది కాదు. ఇస్లాం అంటే- దైవ చిత్తానికి స్వయం సమర్పణ మరియు విధేయతల ద్వారా శాంతిని పొందే మార్గం అని అర్థం. ముస్లిం అంటే – ఇస్లాం మార్గాన్ని అవలంబించే వ్యక్తి (దైవ విధేయుడు) అని అర్థం. కచ్చితంగా చెప్పాలంటే ఇస్లాం అనేది ఒక మతం కాదు, అది ఒక జీవన విధానం. ఏక దైవారాధనే దీని యొక్క మూల సూత్రం. ముస్లిములుగా మేము దేవుడి ప్రవక్తలందరూ కూడా (మొదటి మానవుడు మరియు దైవ ప్రవక్త అయిన ఆదాము నుండి మొదలుకొని అంతిమ దైవ ప్రవక్త అయిన ముహమ్మద్ వరకు) ఈ ఏకేశ్వరాధన సందేశాన్నే బోధించారని విశ్వసిస్తాము.
సత్యాన్ని, హేతుబద్ధమైన బోధనను విశ్వసించండి
ప్రతీ విశ్వాసం లేదా సిద్ధాంతం ఏదో ఒక భౌగోళిక ప్రదేశం నుండే ప్రారంభం అవుతుంది. దాని ఆధారంగా దానిని కేవలం ఆ ప్రాంతానికి పరిమితం చెయ్యడం, అన్య విశ్వాసంగా భావించడం సరి కాదు. సత్యం, హేతుబద్ధతల ఆధారంగానే మనం ప్రతీ విశ్వాసాన్ని పరిశీలించాలి.