ఈ అంశాన్ని గురించి మాట్లాడే అనేక వాక్యాలు ఖుర్ఆన్ లో ఉన్నాయి. అవి: 3:28, 3:118, 4:144, 5:51 మరియు 58:22. ఖుర్ఆన్ మరియు ప్రవక్త ముహమ్మద్ (ఆయనపై శాంతి కలుగు గాక) యొక్క ప్రవచనాల వెలుగులో ఈ వాక్యాలను విశ్లేషించాలి, ఎందుకంటే ఇవి ఇస్లామీయ విశ్వాసాలకు మూల స్తంభాలు మరియు ఇస్లామీయ చట్టాలకు పునాదులు.
వాక్యాల యొక్క విశ్లేషణ – 3:28, 4:144 మరియు 5:51
వాక్యాల అనువాదాన్ని ఇప్పుడు చూద్దాం.
విశ్వాసులు – తమ తోటి విశ్వాసులను విడిచి – సత్యతిరస్కారులను రక్షకులుగా చేసుకోరాదు. అలా చేసేవారికి దేవుడితో ఏ విధమైన సంబంధంలేదు. కాని, వారి దౌర్జన్యానికి భీతిపరులైతే తప్ప! దేవుడు (ఆయనకే భీతిపరులై ఉండమని) మిమ్మల్ని స్వయంగా హెచ్చరిస్తున్నాడు. మరియు దేవుడి వైపుకే మీ మరలింపు ఉంది.
ఖురాను 3:28
ఓ విశ్వాసులారా! మీరు విశ్వాసులను వదలి సత్యతిరస్కారులను, మీ రక్షకులుగా చేసుకోకండి. ఏమీ? మీరు, మీకే వ్యతిరేకంగా, దేవుడికి స్పష్టమైన ప్రమాణం ఇవ్వదలచుకున్నారా?
ఖురాను 4:144
ఓ విశ్వాసులారా! యూదులను మరియు క్రైస్తవులను రక్షకులుగా చేసుకోకండి. వారు ఒకరికొకరు రక్షకులు. మీలో ఎవడు వారిని రక్షకులుగా తీసుకుంటాడో వాస్తవానికి అతడు వారిలో చేరిన వాడవుతాడు. నిశ్చయంగా, దేవుడు దుర్మార్గులకు మార్గదర్శకత్వం చేయడు
ఖురాను 5:51
పై శ్లోకాల యొక్క భాషాపరమైన విశ్లేషణ
పై వాక్యాలలో ఉపయోగించబడిన అరబీ పదం ఔలియా. కొన్ని ఖురాను అనువాదాలలో దీనిని స్నేహితులు లేదా మిత్రులు అని అనువదించడం వలన ఈ విధమైన అపార్థం ఏర్పడింది. “ఔలియా” అనేది “వలి” అనే పదం యొక్క బహువచనం., వలి అనే పదానికి స్నేహితుడు, మిత్రుడు, సహాయకుడు, సంరక్షకుడు మొదలైన అర్ధాలు ఉన్నాయి.
ఒక పదానికి అనేక అర్ధాలు ఉన్నప్పుడు మనం సందర్భానికి తగిన అర్ధాన్ని తీసుకోవాలి. ఉదాహరణకు beat అనే ఇంగ్లీషు పదం తీసుకుంటే, దానికి కూడా అనేక అర్ధాలు ఉన్నాయి. ఒకటి కొట్టడం, మరొకటి ఓడించడం. అయితే సందర్భాన్ని బట్టి మనం దాని అర్ధాన్ని వాడవలసి ఉంటుంది. ఉదాహరణకు “India beat Pakistan in World cup Final” అనే వాక్యాన్ని అనువదించాల్సి వస్తే మనం ఇక్కడ beat కు ఏ అర్ధాన్ని వాడాలి? ఇండియా పాకిస్తాన్ ను కొట్టింది అనాలా? ఓడించింది అనాలా? ఓడించింది అనే అర్ధాన్నే తీసుకోవాలి కదా? కొట్టింది అనడం తప్పు కదూ?
ఈ విధంగా సందర్భాన్ని బట్టి కొన్ని పదాల యొక్క అర్ధాలు మారుతుంటాయి. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు ఖురాను వాక్యాలను విశ్లేషిద్దాము.
“ఔలియా” అనే పదాన్ని విశ్లేషించే ముందు మనం ఒక హదీసుని (అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ గారి ప్రవచనాన్ని) గమనిద్దాము.
“లా నికాహ ఇల్లా బి వలి”. “వలీ లేకుండా నికాహ్ (పెళ్ళి) అనేది లేదు.”
ఇది ఒక ప్రామాణిక హదీసు. ఈ సందర్భంలో వలి అంటే సంరక్షకుడు అనే అర్ధాన్ని తీసుకోవాలి, అంటే సాధారణంగా పెళ్లి కుమార్తె తండ్రి. అంతే గాని ఇక్కడ వలి అంటే స్నేహితుడు అనే అర్ధం వాడి “స్నేహితుడు లేకుండా నికాహ్ (పెళ్ళి) అనేది లేదు” అంటే విడ్డూరంగా ఉంటుంది.
అదే విధంగా, ఖురానులోని పై వాక్యాలలో ఔలియా (వలి యొక్క బహువచనం) అంటే రక్షకులు లేదా సహాయకులు అని అర్ధం. అంతే గాని స్నేహితులు లేదా మిత్రులు అని కాదు. దీనికి కారణం ఆ వాక్యాల సందర్భమే. ఈ వాక్యాలు తమని తాము ముస్లిములమని ప్రకటించుకొని, ముస్లిములతో పోరాడి వారి ప్రాణాలు తీస్తున్న ముస్లిమేతర శత్రువుల సహాయాన్ని అభ్యర్ధిస్తున్న వారి గురించి అవతరించాయి. ముస్లిములందరికి అన్ని సందర్భాలలో దీనిని ఆపాదించడం తప్పు.
స్నేహితుడు అనేది విస్తృతార్థం కలిగిన పదం, సందర్భాన్ని బట్టి దాని అర్ధం కూడా మారవచ్చు. అయితే ఇక్కడ మనం స్నేహం అంటే ముస్లిమేతరులతో న్యాయబద్ధమైన సత్ప్రవర్తనను కలిగి ఉండడం అని అర్ధం తీసుకుందాము.
ఇప్పుడు 3:118 వాక్యాన్ని పరిశీలిద్దాము.
ఓ విశ్వాసులారా! మీరు మీ వారిని (విశ్వాసులను) తప్ప ఇతరులను మీ సన్నిహిత స్నేహితులుగా చేసుకోకండి. వారు మీకు హాని కలిగించే ఏ అవకాశాన్నైనా ఉపయోగించుకోవటానికి వెనుకాడరు. వారు మిమ్మల్ని ఇబ్బందిలో చూడగోరుతున్నారు. మరియు వారి ఈర్ష్య వారి నోళ్ళనుండి బయటపడుతున్నది, కాని వారి హృదయాలలో దాచుకున్నది దాని కంటే తీవ్రమైనది. వాస్తవానికి మేము ఈ సూచనలను మీకు స్పష్టం చేశాము. మీరు అర్థంచేసుకోగలిగితే (ఎంత బాగుండేది)!
ఖురాను 3:118
ముస్లిములకు నష్టం కలిగించాలనే తపనతో ఉన్న ముస్లిమేతరుల గురించి ఇక్కడ చెప్పబడుతుందని అర్ధం అవుతుంది. అంతే గాని ముస్లిమేతరులందరూ మీ శత్రువులు అని చెప్పబడడం లేదు.
ఇప్పుడు 58:22 వాక్యాన్ని పరిశీలిద్దాము.
అల్లాహ్ మరియు పరలోకాన్ని విశ్వసించే జనులలో, దేవుడు మరియు ఆయన సందేశహరుణ్ణి వ్యతిరేకించేవారితో స్నేహం చేసుకునే వారిని నీవు పొందలేవు! ఆ వ్యతిరేకించేవారు, తమ తండ్రులైనా లేదా తమ కుమారులైనా లేదా తమ సోదరులైనా లేదా తమ కుంటుంబంవారైనా సరే! అలాంటి వారి హృదయాలలో ఆయన విశ్వాసాన్ని స్థిరపరచాడు. మరియు వారిని తన వైపు నుండి ఒక ఆత్మశక్తి (రూ’హ్) ఇచ్చి బలపరిచాడు. మరియు వారిని క్రింద కాలువలు ప్రవహించే స్వర్గవనాలలో ప్రవేశింపజేస్తాడు. అందులోవారు శాశ్వతంగా ఉంటారు. దేవుడు వారి పట్ల ప్రసన్నుడవుతాడు మరియు వారు ఆయన పట్ల ప్రసన్నులవుతారు. ఇలాంటి వారు దేవుడి పక్షానికి చెందినవారు. గుర్తుంచుకోండి! నిశ్చయంగా, అల్లాహ్ పక్షం వారే సాఫల్యం పొందేవారు.
ఖురాను 58:22
ఇది ఒక యుద్ధ సమయంలో అవతరించిన వాక్యం (బద్ర్ యుద్ధం). ఆ సమయంలో ముస్లిముల శత్రువులు ముస్లిములను సర్వ నాశనం చేయాలనే సంకల్పంతో ముస్లిముల కన్నా మూడు రెట్ల సంఖ్యా బలంతో సాయుధులై వచ్చారు. వారిలో ముస్లిముల బంధువులు కూడా ఉన్నారు. అయినా సరే ముస్లిములు బంధుప్రీతి, మమకారాల కన్నా కూడా ఏకేశ్వరాధన అనే సత్యానికే ప్రాముఖ్యతనిచ్చి వారితో పోరాడారు. దేవుడు ప్రవక్త యొక్క ఈ అనుచరులను ఈ వాక్యాలలో కొనియాడుతున్నాడు. ఈ సందర్భంలో ఈ వాక్యాలను అర్ధం చేసుకుంటే ఇందులో ముస్లిమేతరులతో అసలు స్నేహమే నిషిద్ధం అని ఎక్కడా కనిపించదు.
ఇటువంటి భావనలు సరిగా అర్ధం చేసుకోవడానికి ఖురాన్ (లేదా ఇతర ఏ గ్రంధమైనా సరే) సమగ్రంగా విశ్లేషించాలి. అక్కడక్కడి వాక్యాలను వాటి సందర్భం నుండి వేరు చేసి చూస్తే, ఆ భావనలు సరిగా బోధపడకపోగా ఇటువంటి అపార్థాలకే దారితీస్తుంది.
ఖుర్ఆన్ యొక్క ఈ వాక్యాలను కూడా పరిశీలించండి
ఓ విశ్వాసులారా! మీరు దేవుడి కొరకు న్యాయంగా సాక్ష్యమివ్వటానికి స్థిరంగా నిలబడండి. ఇతరుల పట్ల మీకున్న ద్వేషానికి లోనై, మీరు న్యాయాన్ని త్యజించకండి. న్యాయం చేయండి, అది దైవభక్తికి సమీపమైనది. మరియు దేవుడి యందు భయ భక్తులు కలిగి ఉండండి. నిశ్చయంగా, మీరు చేసేదంతా దేవుడు ఎరుగును.
ఖురాను 5:8
నిశ్చయంగా, దేవుడు న్యాయం చేయమని మరియు (ఇతరులకు) మేలు చేయమని మరియు దగ్గరి బంధువులకు సహాయం చేయమని మరియు అశ్లీలత, అధర్మం మరియు దౌర్జన్యాలకు దూరంగా ఉండమని ఆజ్ఞాపిస్తున్నాడు. ఆయన ఈ విధంగా మీకు బోధిస్తున్నాడు, బహుశా మీరు హితబోధ గ్రహిస్తారని.
ఖురాను 16:90
ఒకవేళ ఒక ముస్లిమేతర సమూహం పట్ల అయిష్టత ఉన్నా కూడా వారి పట్ల అన్యాయంగా గాని పక్షపాత ధోరణితో గాని వ్యవహరించకూడదని పై వాక్యాల ద్వారా తెలుస్తుంది.
ఇంకా ఖుర్ఆన్ లో ఇలా చెప్పబడింది:
ఎవరైతే ధర్మవిషయంలో మీతో యుద్ధం చేయరో మరియు మిమ్మల్ని మీ గృహాల నుండి వెళ్ళగొట్టరో! వారి పట్ల మీరు సత్ప్రవర్తనతో మరియు న్యాయంతో వ్యవహరించటాన్ని దేవుడు నిషేధించలేదు. నిశ్చయంగా దేవుడు న్యాయవర్తనులను ప్రేమిస్తాడు
ఖురాను 60:8
ఈ వాక్యంలో “తబర్రుహుమ్” అనే పదం వాడబడింది. ఈ పదం “వారిపట్ల సత్ప్రవర్తన మరియు న్యాయంతో వ్యవహరించడం” అని అనువదించబడింది. ఈ పదం “బిర్ర్” అనే మూల పదం నుండి వచ్చింది. “బిర్ర్” అనేది అత్యున్నతమైన సత్ప్రవర్తనను సూచించే పదం. ఉదాహరణకు తల్లిదండ్రుల పట్ల ఉండవలసిన వైఖరికి కూడా ఈ పదం ఉపయోగించబండింది. ఉదాహరణకు “బిర్రుల్ వాలిదైన్” అంటే “తల్లిదండ్రుల పట్ల సత్ప్రవర్తన”అని అర్ధం. ఈ “బిర్రుల్ వాలిదైన్” అనే పదం ఒక హదీసులో కూడా ఉంది. ఇబ్న్ మసూద్ (ర) గారి వ్యాఖ్యానం. నేను దైవ ప్రవక్త ముహమ్మద్ (స) గారిని అడిగాను. “ఏది ఉత్తమమైన కార్యం అని?” దానికి ఆయన “సమయం అయిన వెంటనే ప్రార్ధన (నమాజు) చేయడం” అన్నారు. “ఆ తరువాత?” అని అడిగాను. దానికి ఆయన ” తల్లిదండ్రుల పట్ల సత్ప్రవర్తన (బిర్రుల్ వాలిదైన్) అన్నారు. [సహిహ్ బుఖారి, సహిహ్ ముస్లిం]
దీనిద్వారా సుస్పష్టమవున్నదేమిటంటే ముస్లిమేతరుల పట్ల ముస్లిములు అత్యుత్తమమైన నడవడికను కలిగి ఉండడాన్ని దేవుడు నిషేధించలేదు.
ఇస్లాం ధర్మం ప్రకారం పొరుగు వారితో ఎలా మెలగాలి?
అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ (స) గారి సతీమణి ఆయెషా (ర) దైవ ప్రవక్త ఇలా సెలవిచ్చారని తెలియపరిచారు.
దైవ దూత జిబ్రయీల్ (అ) నన్ను పొరుగువారితో ఆప్యాయతతో, మర్యాదగా మసలుకోమని పదే పదే బోధించారు. ఎంతగానంటే వారికి ఆస్తిలో వారసత్వం ఆదేశించబడుతుందేమో అని నేను అనుకునేంతగా …
సహీహ్ బుఖారి
పొరుగువారు ముస్లిమేతరులైనా వారితో ప్రేమాభిమానాలతో మసలుకోవాలని దైవ ప్రవక్త మరియు ఆయన అనుచరుల ఆచరణల ద్వారా మనకు తెలుస్తుంది.
ఈ విధంగా ముస్లిములు ముస్లిమేతరులతో స్నేహం చెయ్యకూడదని ఇస్లాం ధర్మం బోధిస్తుందనేది ఒక తప్పుడు అభియోగం అని ఋజువవుతుంది.