ఈ ప్రశ్నకు సమాధానం ఇచ్చే ముందు, హలాల్ మాంసం మరియు జట్కా మాంసం అంటే ఏమిటో తెలుసుకుందాం. హలాల్ అనేది అరబిక్ పదం, దీని అర్థం “అనుమతించదగినది”. మేక లేదా గొర్రె లేదా కోడిని ఒక నిర్దిష్ట పద్ధతిలో వధిస్తే దానిని “హలాల్ లేదా అనుమతించదగిన” మాంసం అని అంటారు.
హలాల్ మాంసం – జట్కా మాంసం – తేడా ఏమిటి?
హలాల్ వధ
“హలాల్” ప్రక్రియలో మేక లేదా గొర్రె లేదా కోడి యొక్క కంఠ నాళము, శ్వాస నాళము మరియు మెడ నుండి పోయే గళ ధమనులను కత్తిరించడం జరుగుతుంది. దీనివలన ఆ జంతువు శరీరం నుండి రక్తం పూర్తిగా బయటకు కక్కబడుతుంది.
జట్కా వధ
జట్కా అంటే “తక్షణం”, ఈ పద్ధతిలో వధించినపుడు, మేక లేదా గొర్రె లేదా కోడిని ఒకే కోతతో లేదా ముందుగా స్పృహ కోల్పోయేలా చేసి తక్షణమే చంపుతారు.
ఏది మంచిది – హలాల్ మాంసం లేదా జట్కా మాంసం?
ఇలాంటి ప్రశ్నను నిష్పక్షపాతంగా చూడాలి మరియు భావోద్వేగంతో కాదు. ముందుగా నిపుణులు ఏమంటున్నారో చూద్దాం. మైసూర్‌లోని సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో మాంసం సాంకేతిక విభాగం అధిపతి డాక్టర్ వి.కె. మోడీ ఇలా అన్నారు:
హలాల్ పద్ధతి వధించిన జంతువు నుండి రక్తాన్ని ఎక్కువగా బయటకు తీయడంలో ప్రభావవంతంగా ఉంటుంది, మాంసం మెత్తగా ఉండాలంటే ఇది చాలా అవసరం. జట్కా పద్ధతిలో, రక్తం గడ్డ కట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాంటి మాంసాన్ని కొన్ని రోజులు ఉడికించకుండా ఉంచితే అది పాడవుతుంది. అంతే కాకుండా జట్కా పద్ధతిలో వధించబడిన మాంసం నమలడం కూడా కష్టతరం కావచ్చు.
న్యూఢిల్లీ అపోలో హాస్పిటల్‌లోని పోషకాహార నిపుణుడు డాక్టర్ కరుణా చతుర్వేది ఇలా అన్నారు:
హలాల్ ఆరోగ్యకరమైనదిగా పరిగణించబడుతుంది, ఎందుకంటే వధ తర్వాత, జంతువుల ధమనుల నుండి రక్తం పోతుంది, తద్వారా చాలా విష పదార్ధాలు బయటకు పంపబడతాయి, ఎందుకంటే వధించిన తర్వాత కూడా కొన్ని సెకండ్ల పాటు గుండె పంపింగ్ చేయడం కొనసాగుతుంది. జట్కా పద్ధతిలో, మొత్తం రక్తం బయటకు పోవడం జరగదు. దీనివలన మాంసం గట్టిగా మరియు ఎండినట్లు ఉంటుంది.
హలాల్ వధ క్రూరమైనదా?
కంఠ నాళము, శ్వాస నాళము మరియు గళ ధమనులు తెగిపోయినప్పుడు, మెదడులోని నరాలకు రక్త సరఫరా నిలిచిపోతుంది. దీని కారణంగా, జంతువు నొప్పిని అనుభవించదు. జంతువు గుంజుకున్నట్లు లేదా తన్నుకున్నట్లు కనిపించవచ్చు కానీ అది రక్తం మందగించిన కండరాల సంకోచ-వ్యాకోచాల వల్లే గాని నొప్పి వల్ల కాదు.
వివాదం ఉండాలా?
పైన పేర్కొన్న నిపుణుల అభిప్రాయంతో ముస్లిమేతరులు ఏకీభవించనప్పటికీ, జట్కా మాంసాన్ని ఎంచుకోవడానికి వారికి ఎల్లప్పుడూ స్వేచ్ఛ ఉంది. నిజానికి, ఉత్తర భారతదేశంలో, ముఖ్యంగా పంజాబ్‌లో చాలామంది జట్కా మాంసాన్ని ఎంచుకుంటారు. రెస్టారెంట్లు మరియు హోటళ్లలో హలాల్ మాంసం మాత్రమే వడ్డించాలని ఎటువంటి చట్టం లేదా నిబంధన లేదని కూడా మనం గమనించాలి. జట్కా మాంసాన్ని కొనుక్కునేందుకు వినియోగదారులకు మరియు వడ్డించడానికి రెస్టారెంట్లకు పూర్తి స్వేచ్ఛ ఉన్నప్పుడు, ముస్లిమేతరులకు ఈ విషయంలో సమస్య ఎందుకు ఉండాలి?
హలాల్ మాంసం వలన హిందువులకు నిరుద్యోగం కలుగుతుందా?
కొంత మంది హలాల్ మాంసం ఒక రకమైన ఆర్ధిక జిహాద్ వంటిదని, అది ముస్లిమేతరులకు కాకుండా కేవలం ముస్లిములకు మాత్రమే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని వాదిస్తారు. ఇది పూర్తిగా అసంబద్ధమైన ఆరోపణ. మాంసం దుకాణాలు ముస్లిములవీ ఉన్నాయి, ముస్లిమేతరులవి కూడా ఉన్నాయి. మాంసాహార హిందువులు (దేశ జనాభాలో 75%), మాంసాహార ఇతర ముస్లిమేతరులు (దేశ జనాభాలో 5%) కలిపితే వారు ముస్లిముల (దేశ జనాభాలో 15%) కన్నా ఎంతో ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఇంతకు ముందు వివరించినట్టు, మాంసాహార హిందువులు జట్కా మాంసాన్ని ముస్లిమేతర మాంసపు దుకాణాల నుండి కొనే స్వేచ్ఛను కలిగి ఉన్నారు. హలాల్ మాంసం కొనమని వారినెవరూ బలవంతం చేయడం లేదు కదా? మాంసాహార ముస్లిమేతర వినియోగదారుల సంఖ్య చాలా ఎక్కువ మరియు వారు జట్కా మాంసాన్ని కొనే స్వేచ్ఛను కలిగి ఉన్నారు కాబట్టి ఇది హిందువుల మరియు ఇతర ముస్లిమేతరుల ఉద్యోగ అవకాశాలను ఏ మాత్రం కూడా తగ్గించదు.
ఔషధ సంబంధ, వ్యక్తిగత పరిశుభ్రతకు సంబంధించిన, సౌందర్య సంబంధ ఉత్పత్తుల విషయంలో కూడా ముస్లిమేతర వినియోగదారుల సంఖ్య (దేశ జనాభాలో 80%) ముస్లిముల సంఖ్య (దేశ జనాభాలో 15%) కన్నా చాలా ఎక్కువ. మీరు ఒక సౌందర్య సంబంధ ఉత్పత్తుల వ్యాపార సంస్థను నడుపుతుంటే మీరు ఎవరిని ఎక్కువగా పట్టించుకుంటారు? 80% వినియోగదారులనా? 15% వినియోగదారులనా? ఖచ్చితంగా 80% మంది వినియోగదారులైన ముస్లిమేతరులనే కదా? మరి అలాంటప్పుడు 15% మంది వినియోగదారులు వ్యాపార సంస్థలను హలాల్ ఉత్పత్తుల కోసం ఎలా బలవంతం చేయగలరు? అలాంటప్పుడు ఈ రంగంలో ముస్లిమేతరులకు ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా తగ్గుతున్నాయి?
ఈ విధంగా హలాల్ మాంసం ద్వారా ఆర్ధిక జిహాద్ జరుగుతుందనే ప్రచారం పూర్తిగా అసత్యమైనది మరియు ద్వేషపూరితమైనదని అర్ధం అవుతుంది.