ప్రవక్తలు అంటే ఎవరు?
దేవుడు మనుషులను సృష్టించి వదిలివేయలేదు, వారికి మార్గదర్శకత్వం చేసే ఏర్పాటు కూడా చేసాడు. ఒక కారు పని తీరును చూపించాలంటే అది మరొక కారుతోనే చేయాలి గాని బైక్ తో కాదు. అలాగే మనుషులు మంచిగా జీవించడానికి దేవుడు ధర్మ పారాయణులైన సత్పురుషులను వారికి ఆదర్శంగా నిలవడానికి మరియు హితబోధ చేయడానికి పంపించాడు. ఈ ఆదర్శ పురుషులే దైవ ప్రవక్తలు. ప్రవక్తలు కేవలం మానవ మాత్రులే, దేవుని గుణగణాలు కలవారు కాదు. కొంత మంది ప్రవక్తలు – అబ్రహం, డేవిడ్, మోసెస్ మరియు జీసస్. దేవుడు ప్రవక్తలను మన దేశంతో సహా ప్రతీ దేశానికి పంపించాడు.
ముహమ్మద్ ప్రవక్త ఎవరు?
సుదీర్ఘమైన ఈ ప్రవక్తల పరంపరలోని చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్. ఆయన సకల మానవాళి కోసం పంపబడ్డారు – మీ కోసం, నా కోసం, మనందరి కోసం మరియు ఈ ప్రపంచం అంతం అయ్యే రోజు వరకు ఆయనే మనందరి ప్రవక్త.
ముహమ్మద్ గారి బాల్య జీవితం
ప్రవక్త ముహమ్మద్ మక్కా నగరంలో, ఖురైష్ అనే వంశంలో జన్మించారు. ఖురైష్ వంశీయులు సామాజికంగా పలుకుబడి కలిగి ఆ నగర ఆర్ధిక, రాజకీయ రంగాలను శాసించేవారు. ఆయన 6 సంవత్సరాల పసి ప్రాయంలోనే ఒక అనాథ అయ్యారు. ప్రవక్త ముహమ్మద్ గారి మంచి నడత, నీతి, నిజాయితీలకు ప్రజలు ఆయనను ఎంతగానో అభిమానించేవారు మరియు ఆయనను “అల్ అమీన్” (విశ్వసనీయుడు) అని పిలిచేవారు.
ప్రవక్త పదవి
ముహమ్మద్ ప్రవక్త ఒక నిరక్షరాస్యులు. 40 సంవత్సరాల వయసు వరకు ఆయనను వక్తగా గాని ప్రబోధకుడిగా గాని రాజకీయవేత్తగా గాని ప్రజలు ఎరుగరు. ఆయన ఎన్నడూ మత సూత్రాలు, ధర్మ శాస్త్రాలు, రాజకీయాలు, నీతిశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సమాజశాస్త్రం లాంటివి బోధించి ఉండలేదు. 40 సంవత్సరాల వయసులో ఆయన ఎక్కువ సమయం మక్కా నగరానికి సమీపంలోనీ ‘హీరా’ అనే కొండ గుహలో దేవుడి గురించిన చింతన చేస్తూ గడిపారు. ‘దేవుడు’ అనే తెలుగు పదానికి అరబీ భాషలో సమాన పదం ‘అల్లాహ్’ (హిందీలో ‘ఈశ్వర్’, కన్నడంలో ‘దేవరు’, ఆంగ్ల భాషలో ‘గాడ్’). ఒకరోజు ముహమ్మద్ ప్రవక్త గారికి ఆ దేవుడి నుండి మొదటి సందేశం (దివ్య వాణి) దైవదూత అయిన ‘జిబ్రాయీల్’ ద్వారా అందింది. అప్పటి నుండి తదుపరి 23 సంవత్సరాల వరకు అది కొనసాగింది. ఆ సందేశంలో దేవుని ఏకత్వం, సృష్టి పరమార్థం, గతించిన ప్రవక్తల జీవిత విశేషాలు, నైతికత, ధర్మం, మరణానంతర జీవితం మొదలైన వాటి గురించిన వివరాలు ఉన్నాయి. ఈ సందేశాల సంకలనాన్ని ఖురాన్ అంటారు, ఇది పూర్తిగా దైవ వాణి. ప్రవక్త సొంత మాటల, ఆచరణల సంకలనం వేరుగా చేయబడింది, దానిని ‘హదీత్’ అంటారు.
ఆయన సందేశం
ముహమ్మద్ ప్రవక్త ‘ఇస్లాం’ అనే ఒక కొత్త మతాన్ని స్థాపించలేదు. ఇస్లాం అనే అరబిక్ పదానికి అర్ధం దేవుడి విధేయత, దాస్యం మరియు ఆజ్ఞా పాలన. గతించిన ప్రవక్తలందరి బోధన కూడా ఇదే. వారందరూ బోధించిన ధర్మాన్నే ముహమ్మద్ ప్రవక్త పునరుద్ధరించారు. ముహమ్మద్ ప్రవక్త బోధించిన కొన్ని ముఖ్య విషయాలు:
1. మానవ జీవిత పరమార్థం సృష్టికర్తను ఆరాధించడం, సృష్టికర్త ఆజ్ఞాపాలన చేయడం తప్ప మరేమీ కాదు. (సృష్టికర్తనే ఆరాధించాలి, సృష్టితాలను కాదు. చెట్లు, చేమలు, నదులు, సూర్య చంద్రులు, గ్రహాలు, నక్షత్రాలు, జంతువులు, విగ్రహాలు, పుణ్యపురుషులు, బాబాలు, దైవ ప్రవక్తలు, పౌరాణిక గాథలలోని పాత్రలు మొదలైనవన్నీ సృష్టితాలే. దేవుడి అస్తిత్వాన్ని నిరాకరించకూడదు, ఎవరినీ లేదా దేనిని కూడా దేవుడి అస్తిత్వానికి సమానంగా చేయకూడదు)
2. దేవుడు ఒక్కడే. దేవుడికి తల్లిదండ్రులు, సంతానం, భార్యాపిల్లలు ఉండరు. ఆయనకు సమానమైనదేదీ లేదు.
3. మనం ఈ ప్రాపంచిక జీవితంలో చేసే కర్మలన్నింటికీ మరణానంతర జీవితంలో దేవుడి ముందు హాజరై సమాధానం ఇచ్చుకోవలసి ఉంటుంది.4. దేవుడు మనుషుల మధ్య పుట్టుక, జాతి, కులం, వంశం మొదలైన వాటి ఆధారంగా బేధ భావం కలిగి ఉండడు. ఆయన ముందు మానవులంతా సమానమే.
ప్రవక్త గారి సందేశ ప్రచారం – ధనం, అధికారం, పలుకుబడి, స్త్రీ లోలత్వం కోసం కాదు
మక్కా ప్రజలు ఆయనను తమ రాజుగా అంగీకరిస్తామని, ధన ధాన్యాలను సమర్పించుకుంటామని, ఆయనకిష్టమైన స్త్రీతో వివాహం జరిపిస్తామని ప్రతిపాదించారు. వారి ప్రతిపాదనలను తిరస్కరించారు ముహమ్మద్ ప్రవక్త. నిందలు, అవమానాలు, భౌతిక దాడులు, సామాజిక బహిష్కరణ మొదలైనవి సహిస్తూ దేవుని ఏకత్వ సందేశాన్ని ప్రచారం చేశారు. దీనిని బట్టి ముహమ్మద్ ప్రవక్త ప్రాపంచిక ప్రయోజనాల కోసం సందేశ ప్రచారం చేయలేదని అర్ధం అవుతుంది.
రాజ్యాధికారిగా ప్రవక్త
13 సంవత్సరాలు మక్కా ప్రజల పీడనను సహనంతో భరించిన ముహమ్మద్ ప్రవక్త, మదీనా నగరానికి వలసపోయారు. అక్కడి ప్రజలు ఆయనను దైవ ప్రవక్తగా ఆమోదించడమే కాక తమ నాయకుడిగా, రాజ్యాధికారిగా చేసుకున్నారు. ఆయన మరణించిన సమయానికి దాదాపు మన భారత దేశమంత భూభాగం ఆయన పరిపాలన క్రిందకు వచ్చింది. అంతటి విశాల సామ్రాజ్యానికి అధిపతి, లక్షల ప్రజలకు ఆధ్యాత్మిక నేత అయినప్పటికి ఆయన ఎంతో అణకువతో నిరాడంబరంగా జీవించారు.
ప్రవక్త నిరాడంబర, సాధారణ జీవిత
ముహమ్మద్ ప్రవక్త వారి జీవితం ఎక్కువగా బీదరికంలోనే సాగింది. ఒక చిన్న ఇంట్లో, రోజుల తరబడి సరి అయిన ఆహారం కూడా లేకుండా పస్తులు ఉండేవారు. ఒకసారి ఆయన తన రాజ్యంలో పౌరుడైన ఒక యూద వ్యక్తి దగ్గర తన కవచాన్ని (డాలుని) పూచీగా పెట్టి కొన్ని బార్లీ గింజలను అప్పుగా తెచ్చుకున్నారు. అయితే ఆయన ఆ కవచాన్ని తిరిగి తీసుకోకుండానే చనిపోయారు. తాను వెళ్లినపుడు గౌరవ సూచకంగా లేచి నిలబడడం నుండి కూడా ఆయన ప్రజలను వారించారు. ఆయన వద్ద అంగ రక్షకులు కానీ, ఇంటిని కాపలా కాసే సైనికులు గానీ లేరు. తనను ఎక్కువగా పొగడవద్దని ఆయన జనాలకు తాఖీదు చేస్తూ ఇలా అనేవారు – “యేసుక్రీస్తుని ప్రజలు అమితంగా పొగిడినట్లు మీరు నన్ను పొగడకండి, నన్ను కేవలం దేవుడి సేవకుడు మరియు ప్రవక్త అని మాత్రమే పిలవండి”
తన అనుచరులతో ఆయన ఎంత అన్యోన్యంగా ఉండే వారంటే, వారిలో ఒకరిలా కలిసి పోయేవారు. ఆయనను ఎరుగని కొత్త వారు వచ్చి, మీలో ముహమ్మద్ అంటే ఎవరు? అని అడగవలసి వచ్చేది.
ప్రవక్త సమానత్వాన్ని ఆచరించి, బోధించారు
ముహమ్మద్ ప్రవక్త ఇలా ప్రకటించారు – “సమస్త మానవాళి ఆదాము మరియు హవ్వా సంతానమే. ఒక అరబ్బు అరబ్బేతరుడిపై, అరబ్బేతరుడు అరబ్బుపై ఆధిక్యత కలిగి లేడు, అలాగే ఒక తెల్లవాడు నల్లవానిపై, నల్లవాడు తెల్లవానిపై ఆధిక్యత కలిగి లేడు. మీలో దైవభీతి, సదాచరణ కలిగినవాడే ఉత్తముడు.” ముహమ్మద్ ప్రవక్త బిలాల్ అనే మునుపటి ఒక నీగ్రో బానిసను అజాన్ కోసం నియమించారు. అజాన్ అంటే మసీదు నుండి రోజుకు 5 సార్లు ప్రార్ధన కోసం రమ్మని ఇచ్చే పిలుపు, ఇది మసీదు కార్యక్రమాలలో ఎంతో గౌరవనీయమైనదిగా భావించబడుతుంది.
ప్రవక్త మరియు సామాజిక సంస్కరణ
దైవాదేశాలను అనుసరించి, ముహమ్మద్ ప్రవక్త అనేక సాంఘిక సంస్కరణలను చేపట్టారు. తాము చేసే ప్రతీ కర్మకు ఒక రోజు ఆ దైవం ఎదుట నిలబడి జవాబు చెప్పుకోవలసి ఉంటుందని బోధించడం ద్వారా ఆయన ప్రజలలో దైవ భీతిని జనింపజేశారు. ఆయన స్వేచ్ఛా వ్యాపారాన్ని, నైతిక పెట్టుబడులను ప్రోత్సహిస్తూనే కార్మికుల హక్కులను పరిరక్షించి, వడ్డీని నిషేధించారు. మద్యాన్ని, మాదక ద్రవ్యాలను, వ్యభిచారాన్ని, ఇతర నేర ప్రవృత్తులను నిషేధించి ఒక ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని ప్రజలకు పరిచయం చేశారు. గృహ హింసను ఖండించి, స్త్రీలకు వారి అభిప్రాయాలను వెలిబుచ్చే స్వేచ్ఛను ప్రసాదించారు. జంతు, వృక్ష, పర్యావరణ పరిరక్షణకు అవసరమైన చట్టాలను చేశారు. సమాజానికి ఉపయోగపడే జ్ఞానం అది ఎక్కడున్నా సరే నేర్చుకోవాలని ప్రజలను ప్రోత్సహించారు. దాని పర్యవసానంగా ముస్లిములు తమ మత విశ్వాసాలకు మరియు విజ్ఞాన శాస్త్రానికి మధ్య వైరుధ్యాలను లేదా సంఘర్షణను ఎదుర్కొనలేదు సరికదా వారు అనేక వందల సంవత్సరాల పాటు శాస్త్ర సాంకేతిక రంగాలలో జరిగిన అభివృద్ధిలో ముందుండి పాలు పంచుకున్నారు.
ముస్లిమేతరులతో వ్యవహరించిన తీరు
ప్రతీ ఒక్కరూ వారు ఏ మతానికి చెందిన వారైనా సరే న్యాయం మరియు గౌరవంతో వ్యవహరించబడాలని ముహమ్మద్ ప్రవక్త బోధించారు. ఒక సారి ప్రవక్త తన అనుచరులతో కూర్చుని ఉండగా వారి ముందు నుండి ఒక మృతదేహం ఊరేగింపు వెళ్లింది. అప్పుడు ప్రవక్త (గౌరవ సూచకంగా) లేచి నిలబడ్డారు. ప్రవక్త అనుచరులు అది ఒక యూదుని మృతదేహం అన్నారు. దానికి ఆయన – అయితే ఏమిటి? అతడు మనిషి కాదా? అన్నారు.
ప్రవక్త తన కవచాన్ని ఒక యూద వ్యక్తి దగ్గర పూచీగా ఉంచి బార్లీ గింజలు తీసుకోవడం ద్వారా ముస్లిమేతరులు కూడా ఆయన పాలనలో తమ పాలకునికి కూడా అప్పిచ్చేంత పూర్తి స్వేచ్ఛా స్వాతంత్రాలతో ఉండేవారని అర్ధం అవుతుంది. ఖైబర్ ప్రాంతంలోని భూమిని యూదులకిచ్చి దాని నుండి వచ్చే దిగుబడిని కూడా వారే తీసుకొనే ఏర్పాటు చేసారు ముహమ్మద్ ప్రవక్త. ఆయన తలిస్తే ఒక పాలకునిగా, ఆ భూమిని ముస్లిములకు పంచి పెట్టడమో లేక అందులో ముస్లిములను నివసింపజేయడమో చేయవచ్చు. కానీ దానిని యూదులకు లాభదాయకంగా చేయడం వలన ఆయన ముస్లిమేతరులతో కూడా మంచిగా వ్యవహరించారని తెలుస్తుంది. అంతే కాదు, ఇటువంటి సంఘటనల ద్వారా బలవంతపు మత మార్పిడుల ద్వారా ఇస్లాం అభివృద్ధి చెందలేదనేది కూడా తెలుస్తుంది.
ఖురాన్ హిందువులను హతమార్చమని ముస్లిములను ఆదేశిస్తోందా? – ఇక్కడ చదవండి
కాఫిర్ అంటూ ఖురాన్ హిందువులను దూషిస్తుందా? – ఇక్కడ చదవండి
ముస్లిమేతరులను మిత్రులుగా చేసుకోవద్దని ముస్లిములకు ఖురాన్ ఆదేశిస్తోందా? ఖురాన్ విద్వేష ప్రచారం చేస్తుందా? – ఇక్కడ చదవండి
స్త్రీలతో వ్యవహరించిన తీరు
ముహమ్మద్ ప్రవక్త స్త్రీలకు అనేక హక్కులను కల్పించి వారి సాధికారతను ప్రోత్సహించారు. ఆడ శిశువులను హతమార్చి, స్త్రీలను అణగద్రొక్కడాన్ని గర్వించే సమాజాన్ని సమూలంగా మార్చి వేశారు ఆయన. స్త్రీలు – సంపాదించే, విద్యార్జన చేసే, వారసత్వపు ఆస్తిని పొందే, తన జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే, పునర్వివాహం చేసుకునే, విడాకులు ఇచ్చే, ఆస్తిని కలిగి ఉండే హక్కులు కలిగి ఉన్నారని ఆయన ప్రకటించారు. ఇటువంటి హక్కులు ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో స్త్రీలకు కొన్ని వందల సంవత్సరాల తరువాత కానీ రాలేదు. స్త్రీలకు ఉన్నతమైన హోదాని కల్పించిన ఆయన బోధనలు – “మీలో ఉత్తమమైన పురుషులు ఎవరంటే తమ భార్యలతో ఉత్తమంగా మెలిగేవారు”, “మీ సేవ, సత్ప్రవర్తనలకు అందరికంటే ఎక్కువ అర్హురాలు మీ తల్లి”, “తల్లి పాదాల చెంత స్వర్గం ఉంది (అంటే ఆమెను సేవిస్తే స్వర్గ భాగ్యం లభిస్తుంది)”
(ముస్లిం మహిళలు హిజాబ్ ఎందుకు ధరిస్తారు? – ఇక్కడ చదవండి)
యుద్ధాలు – ఎందుకు?
ఒక దేశంపై యుద్ధం జరిగితే ఆ దేశ ప్రజలను రక్షించవలసిన బాధ్యత ఆ దేశాధినేతపై ఉంటుంది. ఉదాహరణకు కార్గిల్ యుద్ధం. ముహమ్మద్ ప్రవక్త చేసిన యుద్ధాలు కూడా ఇటువంటివే. అణచివేతకు వ్యతిరేకంగా, తన ప్రజలను రక్షించడానికి ఆ యుద్ధాలు చేయబడ్డాయి. వాటి అంతిమ లక్ష్యం శాంతిని నెలకొల్పడమే. దేవుడు ఖురానులో ప్రవక్తను ఇలా ఆదేశిస్తున్నాడు:
కాని ఒకవేళ వారు శాంతి వైపుకు మొగ్గితే నీవు కూడా దాని వైపు మొగ్గు మరియు అల్లాహ్‌పై ఆధారపడు.
ఖుర్ఆన్ 8:61
ముహమ్మద్ ప్రవక్త గారి 20 ముఖ్యమైన ఉల్లేఖనాలు
బైబిలు గ్రంధములో ముహమ్మద్ ప్రవక్త గురించిన భవిష్యవాణి
మాజీ కాథలిక్ బిషప్ అయిన డేవిడ్ బెంజమిన్ కెల్దాని గారు 1928లో రచించిన “బైబిలులో ముహమ్మద్” అనే పుస్తకంలో, ముహమ్మద్ ప్రవక్త గురించి బైబిలులో చాలా స్పష్టంగా చెప్పబడిందని నిరూపించారు. దీనికి ఆయన బైబిలులోని క్రింది వాక్యాలను ఆధారాలుగా చూపారు: ద్వితీయోపదేశకాండము 18:18,19 మరియు ద్వితీయోపదేశకాండము 33:2; యోహాను 1:21, యోహాను 14:16, యోహాను 15:26 మరియు యోహాను 16:7.
సర్వ మానవాళికి ఆదర్శ మూర్తి
ప్రతీ జాతి (దేశానికి), తెగకు అనేక మంది ప్రవక్తలను దేవుడు పంపించాడు. వారిలో కొంత మందికి గ్రంధాలు కూడా ఇవ్వబడ్డాయి. అయితే ప్రజలు తమ స్వార్ధ ప్రయోజనాల కోసం ఆ గ్రంధాలలోని సందేశాన్ని కలుషితం చేసి మార్చివేసారు. అందుకని దేవుడు ఒక అంతిమ గ్రంధాన్ని ముహమ్మద్ ప్రవక్త ద్వారా అందించి దానిని ఎటువంటి మార్పులకు లోను కాకుండా సంరక్షించాడు.
ముహమ్మద్ ప్రవక్త ఒక జాతీయవాది నాయకుడు కారు. దేవుడు ఆయనను సర్వ సృష్టి కోసం ఒక కారుణ్యంగా చేసి పంపించాడు. ఆయన ప్రతీ వ్యక్తిని (వారు ఏ జాతి, ఏ దేశానికి చెందిన వారైనా) ప్రేమించారు మరియు వారి గురించి చింతించారు. ఆయన విశ్వ మానవ సోదర భావాన్ని బోధించారు, ప్రతీ వ్యక్తిని దేవునిచే సృష్టించబడిన ఒకే కుటుంబంలోని సభ్యుడిగా భావించారు. ఆయన సందేశం ప్రపంచంలోని సమస్యల మూల కారణాలను అన్వేషించి, దేవుడి ఆజ్ఞాపాలనలో జీవితాన్ని గడపాలనే పరిష్కారాన్ని చూపించింది.
దేవుడు మానవులలోని ఉత్తమోత్తములనే తన ప్రవక్తలుగా నియమించాడు. ముహమ్మద్ దేవుడి అంతిమ ప్రవక్త కావునా మానవాళికి అత్యుత్తమ ఆదర్శం. అందుకని ముహమ్మద్ ప్రవక్త వారి సందేశాన్ని అర్ధం చేసుకొని, ఆయన బోధనలను నిజ జీవితంలో ఆచరించడం ద్వారా మనం ఇహ లోకంలోనే కాక పర లోకంలో కూడా సాఫల్యాన్ని పొందగలం.
ముహమ్మద్ ప్రవక్త గురించి ప్రముఖుల అభిప్రాయాలు
ముహమ్మద్ ప్రవక్త గురించి మహాత్మా గాంధీ
మహాత్మా గాంధీ గారు 1924 లో రచించిన “యంగ్ ఇండియా” పుస్తకంలో ముహమ్మద్ ప్రవక్త గారి గురించి ఇలా అన్నారు
నేడు లక్షల మంది ప్రజల హృదయాలను రాజ్యమేలుతున్న ఒక మహానుభావుడి జీవిత విశేషాలను తెలుసుకోవాలనుకున్నాను. ఇస్లాంకు ఆ రోజుల్లో ఇటువంటి ఘనమైన స్థానం కత్తి బలం ద్వారా వచ్చింది కాదని నాకు మరింత బాగా నిరూపితం అయ్యింది. నిరాడంబరత, ఆడిన మాట తప్పని సౌశీల్యత, అనుచరుల పట్ల అచంచల ప్రేమానురాగాలు, భయమెరుగని వీరత్వం, దేవుడి మరియు తన లక్ష్యంపై ఉన్న అచంచల విశ్వాసం.. కత్తితో కాదు, ఈ సుగుణాల వలన ప్రతీ అవరోధాన్ని ఆయన అధిగమించగలిగారు. (ప్రవక్త జీవిత చరిత్ర యొక్క) 2వ సంపుటి ముగించే సరికి, అ మహానుభావుడి జీవితం గురించి చదవడానికి ఇక ఏమీ మిగలలేదే అని నాకు బాధ వేసింది.
యంగ్ ఇండియా 1924