More

  Choose Your Language

  మొఘలు చక్రవర్తుల ఆగడాలు

  ఏ మతానికి చెందిన రాజులైనా, వారి రాజ్యాలను కాపాడుకోవడం మరియు విస్తరించుకోవడం గురించే ఆలోచించారు. వారు చేసిన పనులన్నీ కూడా ఆ లక్ష్య సాధన కోసమే చేసినవే. రాజులు చేసిన దురాగతాలకు మనం మతాన్ని ఆపాదించడం తగదు.

  మొఘలులు మందిరాలను నాశనం చేశారని, హిందువులను హింసించారని, కత్తి బలంతో హిందువులను ముస్లిములుగా మార్చారని చాలా మంది భావిస్తున్నారు. కొంత మంది ఆ పనులను ఇస్లాం మతంతో ముడిపెట్టడం చేస్తే, మరి కొందరు ఇప్పుడున్న ముస్లిములపై కూడా ద్వేషంతో ఉన్నారు. ఇప్పుడున్న ముస్లిములు అప్పటి మొఘలులు చేసిన దానికి బాధ్యులు ఎలా అవుతారు? వాస్తవాలను పరిశీలిద్దాం రండి..

  ఇస్లాం మతం ఇతర మతాల ఆరాధనాలయాలను ధ్వంసం చేయడం అనేది సహించదు

  దేవుడు ఖురాను గ్రంధంలో ఇలా సెలవిస్తున్నాడు:

  ఒకవేళ దేవుడు ప్రజలను ఒకరి ద్వారా మరొకరిని తొలగిస్తూ ఉండక పోతే క్రైస్తవ సన్యాసుల మఠాలు, చర్చులు, యూదుల ప్రార్థనాలయాలు మరియు మస్జిదులు, ఎక్కడైతే దేవుడి పేరు అత్యధికంగా స్మరించబడుతుందో, అన్నీ ధ్వంసం చేయబడి ఉండేవి. నిశ్చయంగా, తనకు తాను సహాయం చేసుకునే వానికి దేవుడు తప్పకుండా సహాయంచేస్తాడు. నిశ్చయంగా, దేవుడు మహా బలవంతుడు, సర్వ శక్తిమంతుడు.

  22వ అధ్యాయం, 40వ వాక్యం

  ఈ వాక్యాల ద్వారా ఇస్లాం ఇతర మతాల ఆరాధనా ప్రదేశాలను నాశనం చేయమని ముస్లిములను ఆదేశించలేదని, ఇస్లాం రాజ్య పాలనలో కూడా అన్య మతస్థుల ఆరాధనాలయాలకు స్థానం ఉందనీ అర్ధం అవుతుంది. ఇండోనేషియా మరియు మలేషియా దేశాలు దీనికి మంచి ఉదాహరణలు.

  ముస్లిం రాజులు హిందూ మందిరాలను ఎందుకు ధ్వంసం చేశారు? నిజా నిజాలు

  ప్రముఖ చరిత్రకారుడు రోమిలా థాపర్ గారి ప్రకారం – “హిందూ మందిరాలను నాశనం చేయడం అనేది దండయాత్ర చేసిన రాజులకు వారు ముస్లిములైనా, హిందువులయినా ఒక బల ప్రదర్శనగా ఉండేది. హిందూ రాజులు కూడా మందిరాలను ధ్వంసం చేశారనే నిజాన్ని మనం విస్మరిస్తున్నాం. హర్షదేవుడు మరియు ఇతర కాష్మీర్ రాజులు హిందూ దేవాలయాలను వాటిలోని సంపద కోసం ధ్వంసం చేస్తే, పరమర రాజులు వారి చేతిలో ఓడిపోయిన చౌలూక్య రాజులు కట్టిన ఆలయాలను ధ్వంసం చేయడం మనం గుర్తించవచ్చు.” The past as present అనే పుస్తకంలో ఈ వివరాలను మనం చూడగలం.

  ముస్లిం రాజుల ఆగడాలు మరియు ఇస్లాంతో దాని సంబంధం

  ముస్లిం రాజుల ఆగడాలను ఇస్లాంతో ముడిపెట్టడం సబబా అంటే నిశ్చయంగా కాదనేది సమాధానం. ఎందుకంటే:

  1. ఆ రాజుల్లో ఒక్కడు కూడా హజ్ యాత్ర చేయలేదు. హజ్ యాత్ర చేయడం అనేది ఇస్లాంలోని ఐదు ప్రాధమిక విధులలో ఒకటి. ఆ రాజులు ఇస్లాం మతాన్నే సరిగా ఆచరించనప్పుడు, వారు చేసిన పనులను ఇస్లాం మతానికి ఆపాదించడం సరికాదు.

  2. మనం ఆ ముస్లిం రాజులను కేవలం రాజులుగా మాత్రమే చూడాలి, వారు ముస్లిములు అనేది కేవలం కాకతాళీయం. ఎందుకంటే వారి స్వభావ స్వరూపాలు ఇతర మతాల రాజుల కంటే ఏ మాత్రం భిన్నంగా లేవు. రాజ్య విస్తరణ, విలాసవంతమైన జీవితం – ఇవే వారి ఆశయాలు.

  ముస్లిమేతర రాజుల ఆగడాలు

  ముస్లిమేతర రాజులు కూడా అనేక మంది క్రూరత్వాన్ని ప్రదర్శించి, అమాయక ప్రజలను హింసించారనేది చారిత్రక సత్యం. అజాతశత్రు అనే రాజు సింహాసనం కోసం తన సొంత తండ్రినే బంధించగా, చివరకు అతడి కొడుకు ఉదయ భద్రుడు అతడిని చంపుతాడు. మహా పద్మ నందుడు సింహాసనం కోసం తన సొంత సోదరులనే చంపి నంద సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఇటువంటి దురాగతాలను మనం హిందూ మతంతో ముడిపెడతామా?

  కొంత మంది శైవ చోళ రాజులు వైష్ణవులను హింసించారు. దీనిని మనం శైవ మత సిద్ధాంతాలతో ముడిపెట్టి, నేటి శైవికులపై ద్వేషం చూపిస్తామా?

  ముస్లిము రాజుల దురాగతాలను కూడా ముస్లిమేతర రాజుల దురాగతాల వలే మనం ఎందుకు చూడము?

  హిందూ రాజులు హిందూ మందిరాలపై దాడులు చేసి అందులోని విగ్రహాలను సైతం దోచుకున్నారని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.

  రాజులు మరియు వారి యుద్ధాలు

  హిందూ ముస్లిం రాజుల మధ్య జరిగిన యుద్ధాలకు కొంత మంది మతం రంగు పూస్తున్నారు. వాస్తవం ఏమిటంటే, రాజులు తమ రాజ్యాలను రక్షించుకోవడం కోసం, విస్తరించుకోవడం కోసమే యుద్ధాలు చేశారు. దీనికి హిందూ రాజులు, ముస్లిం రాజులు అతీతులు కారు. హిందూ రాజుల మధ్య కూడా యుద్ధాలు జరిగాయి. ఉదాహరణకు చోళులు, పాండ్యులు, చేరులు మధ్య జరిగిన యుద్ధాలు చారిత్రక వాస్తవాలు. మరాఠా సైన్యాలు గుజరాత్ ను హస్తగతం చేసుకున్నాయి, ఇప్పటికీ మరాఠీల ప్రాబల్యం బరోడాలో ఉంది. అశోకుడు కళింగ చక్రవర్తిని, వేల మంది ఒరియాలను హతమార్చాడు. ఇలాంటివి చరిత్రలో ఎన్నో ఉన్నాయి. హిందూ రాజులు తమ హిందూ ధర్మం కోసం ఈ యుద్ధాలు చేశారా లేక సామ్రాజ్య విస్తరణ కోసం చేశారా?

  హిందూ రాజుల వలే ముస్లిం రాజులు కూడా యుద్ధాలు చేసుకున్నారు. అదికూడా ఇస్లాం మతాన్ని విస్తరించడానికి కాదు, వారి వారి రాజ్యాలను విస్తరించుకోవడం కోసమే! హిందువులైన ముస్లిములైనా.. రాజుల ఆగడాలను వారి మతాలతో ముడిపెట్టడం మూర్ఖత్వమే అవుతుంది.

  ముస్లిం రాజులు మరియు భారతదేశంపై వారి దాడులు

  ముస్లిం రాజులు భారతదేశంపై దురాక్రమణ చేసి దోచుకున్నారనే అభియోగం ఉంది. ఇది తప్పుడు అభియోగం ఎందుకంటే అప్పుడు భారత దేశం అనే ఒక దేశ అస్తిత్వం లేదు. అప్పట్లో అనేక రాజ్యాలు, ఎప్పుడూ యుద్ధాలు చేసుకునే రాజులు మాత్రమే ఉండేవారు. ముస్లిములు దండయాత్రలు చేసింది ఈ రాజ్యాలపై మరియు రాజులపై తప్ప భారత దేశంపై కాదు.

  హిందూ రాజులు ఇతర దేశాలపై దండయాత్రలు చేయలేదా?

  చాలా మంది హిందూ రాజులు మన దేశంలో భాగం కాని ఇతర ప్రాంతాలపై దండయాత్రలు చేశారు. ఈ సందర్భంగా రాజేంద్ర చోళుడి గురించి ప్రస్తావించకుండా ఉండలేము. ఇతడు చోళుల రాజ వంశానికి చెందినవాడు. ఇప్పుడున్న శ్రీలంక, ఇండోనేషియా మరియు మలేషియాలను ఇతడు ఆక్రమించుకొని వశపరుచుకున్నాడు. ఇండోనేషియా మరియు మలేషియాలలో హిందూ దేవాలయాలు ఎందుకు ఉన్నాయనేది మీకు ఇప్పుడు అర్ధం అయి ఉండాలి.

  శ్రీలంక, ఇండోనేషియా మరియు మలేషియాలకు విస్తరించిన రాజేంద్ర చోళుడి సామ్రాజ్యం.

  రాజేంద్ర చోళుడి దండయాత్రలను, సామ్రాజ్య విస్తరణను మీరు హిందూ మతంతో ముడిపెడతారా? పెట్టరు కదా? మరి అలాంటప్పుడు ముస్లిం రాజుల దండయాత్రలను, వారి ఆగడాలను ఇస్లాం మతంతో ఎలా ముడిపెట్టగలం?

  ముస్లిం రాజులు హిందువులను బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చారా?

  హిందువులందరినీ ముస్లిములు అవ్వమని బలవంతం చేసేంతగా ముస్లిం రాజులు ఇస్లాం మతాన్ని ఆచరించి ప్రేమించారా? దీనికి సమాధానం ముమ్మాటికీ కాదూ అనేదే. ఒక్క ముస్లిం రాజు కూడా హజ్ యాత్ర చేయలేదు., అది ఇస్లాం మతానికి చెందిన ప్రాధమిక విధి అయినప్పటికీ. వారు మతానికి కాక తమ విలాసాలకు, రాజ్య విస్తరణకు ప్రాముఖ్యత ఇచ్చారనేది అర్ధం అవుతుంది. వారే ఇస్లాం మతాన్ని సరిగా ఆచరించనప్పుడు, వారు ఈ దేశంలో ఇస్లాం మతాన్ని విస్తరించడానికి పూనుకున్నారనేది హాస్యాస్పదం అవుతుంది.

  ముస్లిం రాజులు మన దేశాన్ని దాదాపు 800 సంవత్సరాలు (8 శతాబ్దాలు) పాలించారు. అది ఎంతో సుదీర్ఘమైన సమయం. ఈ సుదీర్ఘ పాలనలో, ఒకవేళ ముస్లిం రాజులు హిందువులందరినీ బలవంతంగా ముస్లిములుగా మార్చే పని చేసి ఉంటే మన దేశంలో 80 శాతం మంది హిందువులు మిగిలి ఉండేవారా? ఒక్క సారి ఆలోచించండి.

  అంతేకాకుండా, ముస్లిముల పాలనలో కూడా పాలితులు అత్యధికంగా హిందువులే. ఇంత పెద్ద దేశాన్ని అంత కాలం పాటు ప్రశాంతంగా పరిపాలించడం అనేది ఇక్కడి మెజారిటీ ప్రజల నమ్మకం, విశ్వాసం మరియు సహాయ సహకారాలు లేకుండా సాధ్యం కాదు. ఇప్పుడున్నంత సాంకేతికత అప్పటి సైన్యంలో లేదు., అప్పుడు సైన్యం అంటే అత్యధికంగా సైనిక బలమే. ముస్లిం రాజుల సైన్యాలలో కూడా అత్యధికులు హిందువులే. ఒకవేళ ఆ ముస్లిం రాజులు ప్రజలను బలవంతంగా ఇస్లాం మతంలోకి మారుస్తుంటే అంత మంది హిందూ సైనికులు చూస్తూ ఊరుకొనేవారా? తిరుగుబాటు చేసి రాజులను హతమార్చి ఉండేవారు కదా? సొంత సైన్యంలో శత్రువులుంటే ఏ రాజయినా పాలించగలడా? పక్షపాతం చూపకుండా ఆలోచించేవారికి ముస్లిం రాజులు బలవంత మత మార్పిడులు చేశారన్నది అబద్ధమని అర్ధం అవుతుంది.

  సారాంశం

  ఏ మతానికి చెందిన రాజులైనా, వారి రాజ్యాలను కాపాడుకోవడం మరియు విస్తరించుకోవడం గురించే ఆలోచించారు. వారు చేసిన పనులన్నీ కూడా ఆ లక్ష్య సాధన కోసమే చేసినవే. రాజులు చేసిన దురాగతాలకు మనం మతాన్ని ఆపాదించడం తగదు.

  మనం 21వ శతాబ్దిలో ఉన్నాము. కులతత్వం, నిరక్షరాస్యత, పేదరికం, ద్రవ్యోల్బణం, కాలుష్యం, పర్యావరణం, నిరుద్యోగం లాంటి అనేక పెద్ద పెద్ద సమస్యలు మన ముందున్నాయి. పేదలకు, ధనికులకు మధ్య వ్యత్యాసం అంతకంతకూ పెరుగుతూ పోతుంది. కొన్ని వందల సంవత్సరాల ముందు జరిగిన వాటి గురించి వక్రీకరించి, ప్రజలలో వైషమ్యాలు పెంచి రాజకీయాలు చేసే బదులు ఇప్పుడున్న సమస్యలపై పోరాడడం అత్యవసరం కాదా?


  మీకు ఆసక్తి కలిగించే ఇతర వ్యాసాలు

  WHAT OTHERS ARE READING

  Most Popular